07-10-2025 09:14:45 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయిపై సనాతన ధర్మం ముసుగులో జరిగిన మనువాద దాడిని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక చీకటి రోజు. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, లౌకిక ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి ఈ దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నప్పటికీ, ఆధిపత్య కులాల నుండి అవమానాలు మాత్రం తప్పడం లేదు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే జస్టిస్ బి.ఆర్.గవాయిపై జరిగిన దాడి.దేశంలో గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తికి ఇంత అవమానం జరిగింది అంటే సామాన్యుల పరిస్థితి ఏరకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ దేశంలో వేల ఏళ్లుగా అవమానాలకు గురవుతున్న జాతులకు ఆత్మగౌరవం దక్కాలంటే రాజ్యాధికారం దక్కాలి.
రాజ్యాధికారం దక్కనంతకాలం మన జాతులకు అవమానాలు, అణిచివేతలు, దాడులు తప్పవు.ఈ దేశంలో రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఎంతటి ఉన్నత స్థాయి పదవులు అనుభవించిన సరే,వాళ్ళకు ఆత్మగౌరవం,రక్షణ రెండూ ఉండవు.జరుగుతున్న ఇటువంటి అమానవీయ దాడులను తీవ్రంగా ఖండించాలి. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ అక్కి బాలకిషన్, జిల్లా కోశాధికారి ఉల్లెందుల మహేష్,మానకొండూర్ అసెంబ్లీ అధ్యక్షులు కుమ్మరి సంపత్, చొప్పదండి అసెంబ్లీ ఉపాధ్యక్షులు బండరకంటి సామెల్, మ్యాక సాయి, తదితరులు పాల్గొన్నారు