07-10-2025 08:26:22 PM
రెడ్డి జాగృతి బీసీల పట్ల కుట్రను మానుకోవాలి..
బీసీ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్..
హనుమకొండ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ చట్టాన్ని గవర్నర్ ఆమోదించాలని బీసీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు కాళోజి జంక్షన్ లో నిరసన వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ మాధవరెడ్డి బీసీల పట్ల మీ కుట్రను మానుకోవాలని వారు హెచ్చరించారు. రిజర్వేషన్ వ్యతిరేకులు రెడ్డి జాగృతి నాయకులు కోర్టులో రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా మండిపడ్డారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయమైన బీసీ రిజర్వేషన్ వాటాను అడ్డుకోవాలని, రిజర్వేషన్ వ్యతిరేకులు రెడ్డి జాగృతి నాయకులు చూడడం చాలా సిగ్గుమాలిన విషయం అన్నారు.
60% ఉన్నటువంటి బీసీలు స్థానిక ఎన్నికలు సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ కావడం ఇష్టం లేక పిడికెడు శాతం ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని చెందినటువంటి మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి బీసీల నోటి కాడి ముద్దను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో చట్టం చేసిన బీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా కాలయాపన చేయడం చాలా విడ్డూరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బైరీ రవికృష్ణ, దాడి మల్లయ్య యాదవ్,బోనగాని యాదగిరి గౌడ్, సమ్మయ్య, సుమన్ గౌడ్,సుమన్, శ్రీనివాస్,రాజు గౌడ్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.