30-11-2024 06:47:27 PM
ఏరియా జిఎమ్ జి.దేవేందర్
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తామని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్ స్పష్టం చేశారు. శనివారం జీఎం కార్యాలయంలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవంబర్ మాసం ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. నవంబర్ మాసానికి గాను నిర్దేశించిన లక్ష్యంలో 60% బొగ్గు ఉత్పత్తి సాద్యమైందని దీనిని రాబోయే రోజుల్లో 100 శాతానికి పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఏరియాలో నాలుగు భూగర్భగనులు రెండు ఓపెన్ కాస్ట్ గనులు నవంబర్ మాసానికి గాను 3.12 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికిగాను 1.88 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందని ఏరియాలో బొగ్గు ఉత్పత్తి ఆశించిన విధంగా లేదని బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.
భూగర్భగనుల్లో కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉంటుందని ఫలితంగా బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని కార్మికుల హాజరు శాతం మెరుగయ్యేలా చర్యలు చేపట్టి బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు అధికారులు కార్మిక సంఘాల నాయకులు కృషి చేయాలన్నారు. ఏరియాలోని ఆర్కే ఓసీపిలో 100% బొగ్గు ఉత్పత్తి సాధించగా, కేకే ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిరాశ పరిచిందని కేకే ఓసిపిలో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓబీ వెలికితీత పనులు ముమ్మరం చేసి బొగ్గు ఉత్పత్తి పెంచుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏరియాలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి అధికారులు సూపర్వైజర్లతో తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని అధికారుల సమిష్టి కృషితో ఏరియా వార్షిక లక్ష్యాలను అధిగమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డీజీఎం ఈఎండ్ఎం వెంకటరమణ, డీజీఎం ఐఈడి రాజన్న, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సివిల్ ఎస్ఈ రాము, డివైపీఎం ఎండి ఆసిఫ్ లు పాల్గొన్నారు.