స్వాతి రెసిడెన్సీ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నాగోల్, జూన్ 3 (విజయక్రాంతి): మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్టలో ఉన్న స్వాతి రెసిడెన్సీ కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ, గతంలో ఏర్పాటు చేసిన యూజీడీ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) మరియు అంతర్గత పైప్లైన్ వ్యవస్థల కారణంగా పలు సాంకేతిక సమస్యలు తలెత్తి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కాలనీ పార్క్కు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడంతో పాటు జిమ్ పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదనంగా కాలనీలోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి సదుపాయాలు మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
వినతులను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారులతో సమీక్షించి, దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ యువ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి, స్వాతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమనాథ్, ఉపాధ్యక్షుడు భాస్కర్ గౌడ్, వరుణ్, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






