రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, మార్చి 24: పల్లె నుండి పట్నం వరకు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అవసరమైన పక్షంలో ఉద్యమాలకు సైతం సిద్ధమని పటాన్చెరు ఎమ్మెల్యే, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రేషన్ డీలర్ల సంఘం సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల సంభవించిన, కరోనా లాంటి మహమ్మారి మూలంగా లక్షలాది మంది చనిపోయిన సమయంలోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించడంలో రేషన్ డీలర్ల పాత్ర శ్లాఘనీయమన్నారు. దశాబ్ద కాలంగా రేషన్ డీలర్లు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు ఇచ్చిన ప్రధాన హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు మాట్లాడుతూ రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు ప్రతి రేషన్ డీలర్ కు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ఎంఎల్‌ఎస్ పాయింటలో ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిలు, కరోనా సమయంలో మరణించిన రేషన్ డీలర్ల కుటుంబ సభ్యులకు తిరిగి రేషన్ దుకాణాలు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.




