19 March, 2026 | 1:51 AM

ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏకలవ్య విద్యార్థులు

19-03-2026 12:16 AM

గుండాల, మార్చి 18 (విజయక్రాంతి):మండల పరిధి ముత్తాపురం గ్రామ సమీపంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చి భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలోని ’ఇన్స్పైర్ మానక్’ కార్యక్రమానికి జె. భార్గవి మరియు జి. జగదీస్ ఎంపిక కావడంతో తమ పాఠశాలకే కాక జిల్లాకు కూడా గొప్ప పేరు తేవడం గర్వంగా ఉందని ఈఎంఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ నితిన్ సింగ్ బుధవారం తెలిపారు.

యువతలో వినూత్న ఆలోచనలను పెంపొందించి సైన్స్ మరియు పరిశోధన రంగాలలో వృత్తిని చేపట్టేలా ప్రోత్సహించ డమే ’ఇన్స్పైర్ మానక్’ కార్యక్రమం యొక్క లక్ష్యమని ఆయన అన్నారు. పాఠశాల కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా ఈఎంఆర్‌ఎస్ కు చెందిన మరో విద్యార్థిని టి. మానస ప్రతిష్టాత్మక ’జేఈఈ అడ్వానస్డ్’ మెంటర్షిప్ కార్యక్రమానికి ఎంపికయ్యారని ఆయన తెలిపారు.

భారతదేశం లోని అత్యంత పోటీతత్వ పరీక్షలలో ఒకటైన జేఈఈలో విద్యార్థులు రాణించేందుకు ప్రత్యేక కోచింగ్, విద్యాపరమైన అనుభవాన్ని అందించే ఈ మెంటర్షిప్, ఎన్‌ఈఎస్టీఎస్ మార్గదర్శ త్వంలో న్యూఢిల్లీలో నిర్వహించబడుతుందని,

ఈ విజయాల పట్ల ఈఎంఆర్‌ఎస్ గుండాల పాఠశాల గిరిజన విద్యార్థులలోని ప్రతిభను పెంపొందించడానికి, వారికి ఉత్తమ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యావకాశాలను అందించేందుకు, పాఠశాల నిబద్ధతకు ఇటువంటి మైలురాళ్లు ప్రతిభింభిస్తాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ఈఎంఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ తో పాటు భోధన, భోధనేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.