2 May, 2026 | 5:58 PM

భూమి అమ్ముకోనివ్వండి… లేకపోతే చనిపోవడానికి అవకాశం ఇవ్వండి

02-05-2026 04:51 PM

పురుగుల మందు డబ్బాతో వృద్ధ దంపతుల నిరసన

చివ్వెంల: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామంలో వృద్ధ దంపతులు తమ భూమి విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు డబ్బాతో నిరసన చేపట్టిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొంగల రాములు, లచ్చమ్మ దంపతులు శనివారం పురుగుల మందు డబ్బా పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. బండమీది చందుపట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 264లో తమకు, తమ కుమారుడి పేరున సుమారు ఎకరం 6 కుంటల భూమి ఉందని తెలిపారు.

తాము అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల పాలయ్యామని, అందువల్ల భూమిని అమ్ముకోవాలని చూస్తుంటే కొంగల రామలింగయ్య కొంతమంది వ్యక్తులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రాములు మాట్లాడుతూ, తాను షుగర్ కారణంగా ఇటీవల కాలివేలును తొలగించుకోవాల్సి వచ్చిందని, చికిత్సకు డబ్బులు లేక ఆసుపత్రి నుంచి ఇంటికి రావాల్సి వచ్చిందన్నారు. తన భార్య కూడా పక్షవాతంతో బాధపడుతోందని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను ఏప్రిల్ 6 మరియు ఏప్రిల్ 20 తేదీలలో కలిసి విజ్ఞప్తి చేశామని, అలాగే జిల్లా ఎస్పీని సంప్రదించి తమకు ప్రాణభయం ఉందని తెలిపినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.

తమ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని అమ్ముకోవడాన్ని అడ్డుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే కుటుంబ సమేతంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమకు ప్రాణహాని ఉందని, ఎప్పుడైనా హాని జరిగే అవకాశం ఉందని భయపడుతున్నామని తెలిపారు. జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమ భూమిని అమ్ముకునేలా చర్యలు తీసుకుని, వైద్య చికిత్స పొందేందుకు సహాయం చేయాలని కోరారు.