ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”ను అచ్చంపేట మున్సిపాలిటీలో సమర్థవంతంగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మున్సిపల్ శాఖ అధికారులు ఆదేశించారు.
మంగళవారం అచ్చంపేట పట్టణంలోని 3వ వార్డు హిందూ స్మశాన వాటికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టిన శ్మశానంలో ముళ్లచెట్ల తొలగింపు, పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. స్మశాన వాటికలోని ముళ్ల కంప చెట్లను, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, దహన సంస్కారాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా దారి వసతులను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.
ఈనెల 6 నుంచి ప్రారంభమైన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజులపాటు వివిధ శాఖలకు సంబంధించిన పది ముఖ్య అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
మార్చి 6 నుంచి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కరణ అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకూల సేవలందించడం లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో తడి-పొడి చెత్త వేరు సేకరణ, పిచ్చి మొక్కల తొలగింపు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త నిర్మూలన, ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట అచ్చంపేట మున్సిపల్ చైర్మెన్ గార్లపాటి శ్రీనివాసులు, ఆర్డిఓ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ మురళి, ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు .




