సిరిసిల్ల-తంగళ్లపల్లి మానేరు బ్రిడ్జిపై రైతుల ధర్నా
మానేరు బ్రిడ్జిపై రైతుల ధర్నా
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు మంగళవారం ధర్నా(Farmers protest ) చేపట్టారు. సిరిసిల్ల తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై(Maneru Vagu Bridge) ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు.
పోలీసులు ధర్నా చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు. తంగళ్లపల్లి 11వ ప్యాకేజీ రంగనాయక సాగర్ ద్వారా కెనాల్ నిర్మాణ పనులకు రూ. 3 కోట్లు నిధులు కేటాయించి పనులు చేపట్టకపోవడం పట్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రెడ్డబోయిన గోపి అన్నారు.
తంగళ్లపల్లి మండలంలో సుమారు 15 గ్రామాలకు నీరందించే కెనాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కానీ.. స్థానిక ఎమ్మెల్యే కెటిఆర్ కానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కెనాల్ నిర్మాణం ద్వారా పది వేల ఎకరాలకు సాగు నీరందుతుందని, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై కెటిఆర్ కూడా మౌనం వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైనా కూడా భూసేకరణ పనులు చేపట్టలేదని విరుచుకుపడ్డారు. రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ నిర్లక్ష్యం చేయడంపై దుయ్యబట్టారు. కెనాల్ నిర్మాణం కోసం రైతులు దీక్షా చేస్తున్న పట్టించుకోవడం లేదని, రైతుల పక్షాన బిజెపి పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.




