12-08-2025 12:10:25 AM
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు
కామారెడ్డి, ఆగస్టు 11 (విజయక్రాంతి) : ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యానికి అవమానకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి కోసం ఈసి ఓట్ల దొంగతనం చేసిందన్నారు. ఈసీ చేసిన ఓట్ల దొంగతనంతో మోదీ ప్రధాని పీఠంపై కూర్చున్నా రని ఆరోపించారు. ఈనెల 7న ఏఐసిసి నేత రాహుల్‌గాంధీ ప్రెస్‌మీట్ పెట్టి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో వివరించారన్నారు.
ఈ సి, బిజెపి రెండు ఒకటేనన్నారు. ప్రధాని పీఠంపై మోడీ దొడ్డిదారిన కూర్చున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచి ఓటర్ జాబితాను నిష్పక్షపాతంగా వ్యవహరించి తప్పులను సరిదిద్దాలన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరైనా తమ అనుమానాలను అడిగితే ఈసీ బెదిరించే ధోరణిని మానుకోవాలని అన్నారు. బీహార్ ఎన్నికలు బ్యాలెట్‌తో నిర్వహించి ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలన్నారు.
అప్పుడే బిజెపి అసలు రంగు బయట పడుతుందన్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలని హితవు పలికారు. లేకుంటే దేశవ్యాప్తంగా రాష్ర్టవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అలాగే కొనసాగిస్తే ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనే శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగుల శ్రీనివాస్, పాత శివకృష్ణమూర్తి, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.