‘తపస్’ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
గాంధారి, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కామారెడ్డి జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం ఆదివారం కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని తపస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఎన్నికల అధికారిగా తపస్ రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్ ఆర్య,పరీశీలకులుగా రాష్ట్ర బాద్యులు భాస్కరచారి, రాంచంద్రం హాజరై ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.
సమావేశం ప్రారంభంలో గత మూడు సంవత్సరాల కాలానికి సంబంధించిన జిల్లా కార్యవర్గ పనితీరు నివేదికను శ్రీ భూనేకర్ సంతోష్ సభ ముందు వివరంగా సమర్పించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంఘ బలోపేతం, విద్యారంగ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆయన నివేదికలో ప్రస్తావించారు.అనంతరం జరిగిన జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో భూనేకర్ సంతోష్ జిల్లా అధ్యక్షులుగా, చాటాపూర్ సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులను సభలోని సభ్యులు ఘనంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా పూర్వ బాధ్యులు శ్రీ పుల్గం రాఘవరెడ్డి మాట్లాడుతూ, తపస్ సంస్థ ప్రధాన ఆశయం విద్యార్థులలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించడం, భారతీయ సంస్కృతిసాంప్రదాయాలను కాపాడుకోవడం, అలాగే ఉపాధ్యాయుల హక్కులు, గౌరవం, భద్రత కోసం నిరంతరం పోరాటం చేయడమే అని స్పష్టం చేశారు. నూతన జిల్లా కార్యవర్గం ఈ లక్ష్యాల సాధనకు కట్టుబడి పనిచేస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.ఈ సమావేశంలో తపస్ బాద్యులు లక్ష్మిపతి, దత్తచారి, ఆంజనేయులు, పవన్, రాజశేఖర్ స్వామి, సంతోష్, ప్రవీణ్, శ్యామ్, సత్యనారాయణ, అనిల్, తారాచంద్, కైలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






