calender_icon.png 12 December, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నియమావళి పాటించాలి

11-12-2025 12:55:31 AM

  1. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత

ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

నాగర్ కర్నూల్ డిసెంబర్ 10 ( విజయక్రాంతి ) : నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీలకు సూచించారు.

జిల్లాలో మొత్తం 20 మండలాలు, 460 గ్రామపంచాయతీలు, 4102 వార్డులు ఉండగా, మొదటి విడతలో 6 మండలాల్లోని 157 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో 17 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మొదటి విడతలో 33 క్రిటికల్ పంచాయతీలను గుర్తించగా, అందులో కల్వకుర్తి డివిజన్లోనే 12 ఉన్నాయన్నారు. భద్రతా చర్యలలో భాగంగా 900 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

జిల్లా సరిహద్దుల్లో మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రూ.1.53 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు 150 లిక్కర్ కేసుల్లో 1470 లీటర్ల మద్యం పట్టుకున్నారు. స్వాధీనం చేసిన మద్యం విలువ సుమారు రూ.6.90 లక్షలుగా అంచనా వేశారు. చట్టసువ్యవస్థ పరిరక్షణలో భాగంగా 834 మంది రౌడీషీటర్లు, ట్రబుల్ మేకర్లను బైండ్ ఓవర్ చేశారు.

అలాగే 22 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించారు. పోలింగ్ కోసం ప్రత్యేకంగా 3 ఎస్‌ఎస్టి టీమ్స్, 20 ఎఫ్‌ఎస్టి టీమ్స్ను రంగంలోకి దింపారు. బందోబస్తులో ఒక అడిషనల్ ఎస్పీ, నాలుగు డిఎస్పీలు, 13 సీఐలు, 44 ఎస్త్స్రలు, 520 కానిస్టేబుల్స్, 168 హెడ్ కానిస్టేబుల్స్/ఎఎస్‌ఐలు, 100 మంది హోం గార్డులు విధులు నిర్వహించనున్నారు.

పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. సోషల్ మీడియాలో కఠిన నిఘా కొనసాగుతుందని, విద్వేషపూరిత పోస్టులు, తప్పుదోవ పట్టించే ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అవసరమైతే గ్రూప్ అడ్మిన్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.