calender_icon.png 27 January, 2026 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమలులోకి ఎన్నికల ప్రవర్తన నియమావళి

27-01-2026 09:55:45 PM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సీడీఎంఏ సెక్రటరీ శ్రీదేవి తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని, నామినేషన్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, జోనల్, నోడల్ అధికారులు, పర్యవేక్షణ బృందాలు, పిఓలు, ఎపిఓలు, ఎన్నికల సిబ్బంది నియామకం ప్రతి అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలని ఖచ్చితంగా పాటించాలని, ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలింగ్, నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఎన్నికలలో వినియోగించే బ్యాలెట్ బాక్సులు, సామగ్రి, బ్యాలెట్ ప్రింటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు, నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలని, స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అవసరమైన పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులు, వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో భాగంగా వెబ్ కాస్టింగ్, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, పిఓలు, ఓపిఓల నియామకం, శిక్షణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్, ఎన్నికల అధికారులు శ్రీనివాసాచారి, ప్రవీణ్, అన్సర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.