06-12-2025 10:46:40 PM
ఎస్పీ అఖిల్ మహాజన్..
బోథ్ (విజయక్రాంతి): పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం సోనాల మండల కేంద్రంలో పర్యటించి ఓటర్లకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలతో మాట్లాడుతూ.. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరి బలవంతం ఓటు హక్కు పై ఉండకూడదని తెలిపారు. ఎన్నికల నియమాలను పాటించాలి, ఓటు హక్కు వినియోగంలో ఎవరి ప్రోత్బలం ఉండకూడదని తెలిపారు. ఎన్నికలను వేలంపాట ద్వారా నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు, 200 మీటర్ల వద్ద సూచించబడిన నియమాలను పాటించాలని తెలిపారు. గొడవలకు, అల్లర్లకు దూరంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోలీసు సహాయాన్ని సంప్రదించాలని తెలిపారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. ఎన్నికలలో ఓటుకు మద్యం, బహుమతులు ఇవ్వడం నేరం అని, ఎక్కడైనా అక్రమ మద్యం సమాచారం ఉన్న డయల్ 100 ద్వారా సమాచారం అందించాలి అని, డబ్బులకు, వస్తువులకు ఓటు హక్కు తో ప్రలోభ పడరాదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జీవన్ రెడ్డి, బోథ్ సీఐ గురు స్వామి, బోథ్ శ్రీ సాయి, బజార్హత్నూర్ ఎస్సై సంజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.