ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం
2024–25 సం|| రూ 1. 64 కోట్లు నిధులు..
ఖర్చు చేసింది రూ. 22,68,753 మాత్రమే.
ఉపాధి హామీ పనులపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడం ఫలితంగా రూ.1,41,41,237 ల మిగులు బడ్జెట్
ఉపాధి హామీ సామాజిక తనిఖీ అడిట్లో బహిర్గతం
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో 01.04.2024 నుండి 31.03.2025 కాలపరిమితి వరకు ఉపాధి హామీ సామాజిక తనిఖీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఇంకుడు గుంతలు, ఉపాధి కూలీల వేతనాలు, మరుగుదొడ్ల తాలుఖా సంబంధించిన బిల్లులు, లబ్ధిదారులకు చెల్లించని, అందని అమౌంట్ వాటి గురించి తెలియచేయడానికి అని తెలియజేశారు. ఈ సమావేశంకి ఉపాధి హామీ హక్కుదారులలో ఒకరు కునుసోతు నాగమణి ని సమావేశ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం ఏపీవో, బ్లాక్ రిసోర్స్ పర్సన్ ఎస్.రాజు ఆడిట్ తనిఖీ నివేదికను చదివి వినిపించారు.
ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ 2005 లో చట్టం ఏర్పడిన ఈ పథకం అవగాహన కల్పించే విధంగా సమావేశం నిర్వహించబడుతుందని, నిజమైన కూలీలు నష్టపోయారా, వర్క్ క్వాలిటీగా జరిగిందా లేదా తనిఖీలో సమాచారం సేకరించబడిందన్నారు. తదనంతరం బి.ఆర్.పి ఎస్ రాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ఉద్దేశ్యం వలస నివారణ, భూగర్భ జలాల అభివృద్ధి, సుస్థిర ఆస్తుల రూపకల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పథకాన్ని తీసుకొచ్చాయని తెలియజేస్తూ ఆడిట్ వివరాలు వివరించారు. హాక్కుదారుల వేతనాలు రూ.21,16,120/-, సామ్రాగ్రి రూ.1,52,643/- మొత్తం రూ. 22,68,753/- అన్నారు. పంచాయతీరాజ్ విభాగంలో మూడు పనులకు గాను రూ.17,57,900/- ఖర్చు చేయడం జరిగిందని, లేబర్ బడ్జెట్ పూర్తిస్థాయిలో వినియోగించలేదని, ఒక కోటి 64 లక్షల రూపాయలకు గాను 22 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రూ.1,41,41,237/- రూపాయలు మిగులు బడ్జెట్ గా గుర్తించబడిందన్నారు.
మొత్తం 24 పనులు చేశారని మట్టి రోడ్డు నిర్మాణం పనులు 1, ఫీల్డ్ ఛానల్ పనులు 5, ఫీడర్ ఛానల్ పనులు 3, చెరువుల పూడిక పనులు 3, ఇంకుడు గుంత నిర్మాణ పనులు 3, నర్సరీ పనులు 2, రోడ్ సైడ్ ప్లాంటేషన్ 1, రెవెన్యూ ప్లాంటేషన్ 1, కొబ్బరి మొక్కల పెంపకం 4, డ్రాగన్ ఫ్రూట్ పెంపకం 1 గా తెలియజేశారు. మూడు ఇంకుడు గుంతల లబ్ధిదారుల అమౌంటు ఒకటిన్నర సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికీ ఇద్దరికి మెటీరియల్ తాలుఖా అమౌంట్ అందలేదని ఆడిట్ లో తెలియజేశారు. పని కొరకు డిమాండ్, పని వద్దు అని నో డిమాండ్ తాలుఖా పత్రాలు నిర్వహణ చేయలేదని, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తిస్థాయిలో జరగలేదని, వేతన రసీదు పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదని, రిజిస్టర్లు పూర్తిస్థాయిలో నిర్వహణ చేయలేదని, ప్రతి నెలకి ఒకసారి నిర్వహించే సమావేశాలు పెట్ట లేదని, లబ్ధిదారులు పని చేసే దగ్గర టెంటు, నీళ్ళు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, నర్సు అందుబాటులో ఉండే విధంగా నిర్వహణ చేయలేదని, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయలేదని, వర్కర్ ఇష్యూ డీటెయిల్స్ నోటీసు బోర్డులో అంటించలేదని, ప్రతి పనికి నియమ బోర్డు పెట్ట లేదని, 24 పనులకు గాను 23 పనులకు నియమ బోర్డు పెట్టలేదని, ఈజీఎస్ క్యాష్ బుక్ తనిఖీ వారికి అందించలేదన్నారు.
నల్లకుంట ప్లాంటేషన్ లో 713 మొక్కలు గాను 53 మొక్కలు బతికి ఉన్నాయని, కొబ్బరి మొక్కలు నాలుగు మంది లబ్ధిదారులకు 443 మొక్కలు గాను 163 మొక్కలే బతికి ఉన్నాయని 330 మొక్కలు చనిపోయాయని, నర్సరీలో 34,000 మొక్కల గాను 6,830 మొక్కలు ఉన్నవని మిగతావి పంపిణీ చేసిన తాలుఖా డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, హోం స్టేట్ రిజిస్టర్ తనిఖీ వారికి ఇవ్వలేదని, మూడు చెరువుల పూడిక పనులు క్యాపిటల్, ఎన్ఓసి రిజిస్టర్ ఆడిట్ వారికి ఇవ్వలేదని, రెండు వర్క్ బిల్లులు 200 హక్కుదారుల హాజరులో తొమ్మిది పని దినాలకు గాను 12 దినాలకు పేమెంట్ చేయడం జరిగిందని అనగా మూడు రోజుల పని దినాలకు అధిక పేమెంట్ చేశారని, ఇద్దరు లబ్ధి లబ్ధిదారులకు 150 కొబ్బరి మొక్కలు గాను 6950 ఖర్చు చేశారని ఎం.బి పరిశీలించగా మొక్కలు ఖర్చు కంటే ప్లాంట్ మెటీరియల్ ఖర్చు ఎక్కువ చేశారని, 24 మొక్కలకు అదనంగా పేమెంట్ చేశారని తదితర వివరాలు సమావేశంలో వచ్చిన ఉపాధి హామీ హక్కుదారులకు గ్రామస్తులకు తెలియజేయగా కార్యదర్శి బండి అనంత కుమార్ వివరాలను నోట్ చేసుకొని మరొక మారు ప్రజలకి చదివి వినిపించి మరలా నిర్వహించే సమావేశం కు పూర్తి వివరాలు అందించని ఫీల్డ్ అసిస్టెంట్ పై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తదనంతరం సర్పంచ్ సమావేశం ఉద్దేశించి ప్రజలను మాట్లాడమని అనగా కొందరు సమావేశం నిర్వహణను ముందుగానే హక్కుదారులకు గ్రామస్తులకు చాటింపు ద్వారా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, దారా రాము, బత్తుల సాయి, ఉయ్యాల లక్ష్మీనారాయణ, పూణేం పోలమ్మ, గ్రామస్తులు, ఉపాధి హామీ హక్కుదారులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




