ఎంపీడీఓకు ఉపాధి హామీ ఉద్యోగుల వినతి
చిన్నంబావి, ఆగస్టు 5 (విజయ క్రాంతి): మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు బుధవారం పెన్డౌన్‌షట్డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర, జిల్లా జేఏసీ పిలుపు మేరకు విధులను బహిష్కరించి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసనతో కార్యాలయ సేవలు స్తంభించడంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అనంతరం ఎంపీడీఓ ఆదర్శ్గౌడ్కు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీవో ధనుంజయ రాజు మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, పే స్కేల్ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను తమకూ వర్తింపజేయాలని కోరారు. జీతాలు సక్రమంగా అందక కుటుంబ పోషణ, పిల్లల చదువుల విషయంలో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఈసీ వెంకటేశ్వర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు మేకల గోపాల్, యాదవ్, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






