6 August, 2026 | 2:08 AM

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి

06-08-2026 01:19 AM

కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5, (విజయక్రాంతి): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజుతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులు, దర్యాప్తు, చార్జిషీట్ల దాఖలు, కోర్టు విచారణ, బాధితులకు పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ  చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు.

2014 నుంచి 2026 జూలై వరకు జిల్లాలో మొత్తం 1,104 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వీటిలో 196 కేసులు తప్పుడు కేసులు గా తేలగా, 908 కేసులు నిజమైనవిగా నిర్ధారణ అయ్యాయని తెలిపారు. 859 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా, 12 కేసుల్లో శిక్షలు నమోదయ్యాయని, 373 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కాగా, 472 కేసులు కోర్టు విచారణ దశలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 49 కేసులు దర్యాప్తు దశలో కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు మాట్లాడుతూ* , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును నిరంతరం పర్యవేక్షిస్తూ పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 

2016 నుంచి అమలులో ఉన్న మూడు దశల పరిహార విధానం ప్రకారం, ఎఫ్‌ఐఆర్ నమోదైన 949 కేసుల్లో 928 కేసులకు జిల్లా కలెక్టర్ ఆమోదం లభించగా, 823 కేసులకు పరిహారం మంజూరైందని, 105 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. చార్జిషీట్లు దాఖలైన 702 కేసుల్లో 580 కేసులకు పరిహారం మంజూరైందని, 122 కేసులు పెండింగ్లో ఉన్నాయని, కోర్టు తీర్పు వెలువడిన 7 కేసులకు సంబంధించి అన్ని 7 కేసుల్లోనూ పరిహారం పూర్తిగా చెల్లించినట్లు వివరించారు.  అదనపు కలెక్టర్  వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్ డి ఓ మధు, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్  తదితరులు పాల్గొన్నారు.