మాతృభాషలో మాట్లాడేలా ప్రోత్సహించండి !
ప్రపంచీకరణ ప్రవాహం ఒక్క తెలుగు భాషనే కాదు. ఇతర భారతీయ భాషలనూ ముంచేస్తున్నది. నేటితరం పిల్లలు కూడా ఆంగ్లవిద్య పట్ల మోజు పెంచుకుంటున్నారు. పాశ్చాత్య నాగరికత ఫలాలను ఏళ్లకాలం నుంచి అనుభవిస్తూ, దాని వల్ల జరిగే కీడు తెలిసీ కూడా ఆవైపే వెళుతున్నారు. భాషాపరంగానూ ఆంగ్లంపదం లేకుండా తెలుగు మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదు. మా చిన్నతనంలో ఏ విషయాన్ని వివరించేందుకైనా చక్కటి తెలుగు పదాలు వాడేవాళ్లం. పెద్దలు ఆ కాలంలో పిల్లలకు ‘ఓం నమఃశివాయ సిద్దం నమః’ అని అక్షరాభ్యాసం చేసేవారు. ఇప్పుడంతా ఎక్కడుంది? ఏబీసీడీతోనే పిల్లల బాల్యం ప్రారంభమవుతున్నది.
ఇది సరైన పద్ధతి కాదు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలి. అలా అని కాన్వెంట్లను తప్పు పట్టే పరిస్థితి లేదు. ఆంగ ్లమాధ్యమంలో బోధించాలన్న ఉద్దేశంతో యాజమాన్యాలు తెలియకుండానే మాతృభాషకు ద్రోహం చేస్తున్నాయి. తల్లిదండ్రులూ ఆంగ్ల మాధ్యమం వైపే మక్కువ చూపిస్తున్నారు. ఇది వ్యవస్థ లో లోపమే తప్ప తల్లిదండ్రులది కాదు. పాఠశాలలు మాతృభాషను పూర్తిగా చంపేస్తున్నాయని చెప్పలేం. కానీ, తల్లిదండ్రులే పిల్లల్ని తెలుగు నుంచి దూరం చేస్తున్నారన్నది వాస్తవం. అంటే తప్పు పెద్దలదే. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇంట్లో వారిని వరసలు పెట్టి పిలుస్తున్నారు.
ఆంగ్లం.. హోదా కాదు
కొందరు పిల్లలు ఎంతగా ఆంగ్ల పదాలు ఉపయోగిస్తే అంత హోదా అనుకుంటున్నారు. అది సరికాదు. వాళ్లు తెలుగు లోనే మాట్లాడాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు అమ్మభాష లోనే ఉండాలి. ప్రభుత్వలూ సంస్కృతికి సంబంధించిన సాహిత్యాన్ని పిల్లలకు తెలియజేయాలి. అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించాలి. తెలుగులో ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయి. నీతికథలు భోదించే విజ్ఞానం బోలెడంత ఉంది. ఆ సాహిత్యం పిల్లలకు ఇది పూర్తి స్థాయిలో అందటంలేదు. భాగవతం, భారతం గురించి నేటి పిల్లల్లో అవగాహన అంతగా లేదు. సినిమావాళ్లు తీసిన తప్పుడు కథలే వాళ్ల మెదళ్ళలో నిక్షిప్తమవుతున్నాయి. అసలు పెద్దవాళ్లకి కూడా తెలియదు. మీ పిల్లలతో చదివించండి.
ఇలా చెబితే ‘అవి చదివితే ఉద్యోగాలు వస్తాయా?’ అని ప్రశ్నిస్తుంటారు కొందరు. ఉద్యోగం రాకపోవచ్చు. కానీ, బతకడం ఎలా బతకాలో తెలుస్తుంది. ఇప్పుడు చదువంటే ఉద్యోగానికి సాధనంగా మారిపోయింది. అమ్మభాష ద్వారా నీతి తెలుసుకున్నంత ప్రభావంతంగా అన్య భాష ద్వారా తెలుసుకోలేం. తెలుగును రక్షించుకోవాలంటే ఒకటే మార్గం. పిల్లలతో తల్లిదండ్రులు రోజూ తెలుగు పుస్తకాలను చదివించడమే. ప్రతి చిన్న విషయాన్ని తెలుగులో మాట్లాడే ప్రయత్నం ఇంటినుంచే ప్రారంభం కావాలి.
సమకాలీన అంశాల మీద పిల్లల్ని మాట్లాడమనాలి. ఇప్పటి వాళ్లకు తెలుగు పద్యాలు చదవడం రాదు. అందుకని ప్రభుత్వాలు పద్యపఠన సమ్మేళనాలు నిర్వహించాలి. అందుకు తొలుత సుమతి, వేమన శతకాలను ఎంచుకోవాలి. పిల్లలకు నేర్పే పద్యాలు మొదట పాదంతోనే వాక్యం పూర్తయ్యే పద్యాలు తీసుకోవాలి. ఉదాహరణకు గంగిగోవుపాలు గరిటెడైనను చాలు, ఇంకా అడిగిన జీతం, ఇయ్యనా మిడివేలపు, దొరన్, గొల్చి మిడుకుట కంటెన్, వడిగల, ఎద్దుల గట్టుక, మడి.. వంటివి పిల్లలకు నేర్పాలి.
చిన్న చిన్న కథలు చెప్పాలి
తల్లిదండ్రులు పిల్లలకు కథలు చెప్పాలి. ఒక జాతిని రక్షించుకోవాలంటే మాతృభాషనే ఆధారం. మాండలికాలు భాష సమాచారాన్ని తెలియజేస్తాయి. ఒక పదాన్ని వివిధ జిల్లాల్లో పలురకాలుగా వ్యవహరిస్తారు. దీనివల్ల ఆ భాష నిలుస్తుంది. ఇతర ప్రాంతాల వాళ్లు ఆ మాండలికాన్ని అప్రయత్నంగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీని వల్ల భాష బతుకుతుంది. మాండలికాలు, జాతీయాలు, సామెతలు, నానుడి.. ఇప్పటి తరానికి తెలియకుండా పోయాయి.
కర్త, కర్మ, క్రియ గురించి తెలియని వాళ్లూ ఉన్నారు. బడిలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు మాండలికాలు, జాతీయాలు, సామెతలు బోధిస్తే అది పిల్లల్లో భాషపై మమకారం పెంచేందుకు దోహదపడుతుంది. పిల్లల్లో భాష మీద పట్టు రావడానికి మాండలికాలు ముఖ్య కారణమవుతాయి. అందుకే పిల్లలకు నిఘంటువులను పరిచయం చేయాలి. భాష పూర్వాపరాలు తెలియాలంచే సామెతలు, జాతీయాలు, నుడికారాలు కీలకం.
మన భాషలో ఒక వస్తువుకు తగిన పదం ఉన్నా కేవలం డాబు కోసం ఆంగ్ల పదాలను రోజువారీ మాటల్లో చేర్చేస్తున్నాం. ఉదాహరణకు డోర్‌లాక్ చేయి అంటాం. వాటర్ తీసుకురా అంటాం. అవే మాటలను తెలుగులో మనం పిల్లలకు చెబితే, వారు కూడా అదే అలవరచుకుంటారు. కావాలంటే మీరు ఒకసారి ఆంగ్లం మాత్రం వచ్చిన వ్యక్తి తోనే మాట్లాడండి. మన భావం మాతృభాషలో చెప్పినంత స్పష్టంగా ఆంగ్లంలో చెప్పగలమా..? అని తరచి చూసుకుంటే ఈ సమస్య రాదు. తెలుగులో మాట్లాడిన పిల్లలను కొన్ని విద్యాసంస్థలు శిక్షిస్తున్నాయని మనం వార్తలు చూస్తున్నాం. ఇది ఎంత బాధాకరం. దండన క్షమించరాని నేరం. దీనిమీద ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.






