నవరసాల ‘లాంతరు గ్లాసు’
తెలుగు సాహిత్య రంగంలో మూడు లైన్ల కవిత్వ సంకలనాలు అరుదు. కవి చిత్తలూరి తాజాగా ‘లాంతరు గ్లాసు’ పేరిట సరికొత్త కవితా సంకలనాన్ని మన ముందుకు తెచ్చారు. వాటిని ఆధునిక హైకూలు, సెన్రూలుగా పేర్కొంటూ, కవి తన సంపుటిలో నవ రసాలను ఒలికించారు. మూడంటే మూడు లైన్లలో పరిమితమైన అక్షరాలతో అపరిమితమైన భావాలను పండించవచ్చని కవి నిరూపించారు. చదువరులను ఆలోచింపజేసే చక్కటి ఆయుధంగా ఈ మూడు లైన్ల కవిత్వాన్ని మలచడంలో ఆయన విజయం సాధించారు. లోతైన సామాజిక స్పృహను గుండెలకు హత్తుకునేలా ప్రదర్శించారు. సంకలనంలో సాగిన కవితా ప్రయాణం సమాజంలోని భిన్న కోణాలను స్పృశించింది.
ఒక చోట కవి సామాజిక వాస్తవికతను ఎండగడుతూ ‘కడుపు నిండని రాత్రి / బాల కార్మికుడి కళ్లల్లో / మెరిసేటి నక్షత్రాలు’.. ఈ పంక్తులు చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. ఆకలితో అలమటించే బాల్యాన్ని కళ్లముందు ఉంచుతాయి. బాల కార్మికుల జీవితాల్లోని దైన్యాన్ని కవి ఇక్కడ ఎంతో ఆర్ద్రంగా ఆవిష్కరించారు. పగలు శ్రమించి, రాత్రి పూట పస్తులుండే పిల్లల ఆశలను ఆకాశంలోని నక్షత్రాలతో పోల్చడం కవి ప్రతిభకు అద్దం పడుతుంది. మూడు లైన్లలోనే ఒక పెద్ద సామాజిక రుగ్మతను ప్రశ్నిస్తూ పాఠకుడిని ఆలోచనలో పడేశారు. మరో హైకూలో ప్రకతికి, మనిషికి ఉన్న సంబంధాన్ని కవి సున్నితంగా చర్చించారు. ‘రాలిన ఆకు / నేలను ముద్దాడుతూ / చెట్టుకు వీడ్కోలు’..
ఈ పంక్తులలోని భావప్రకటన అద్భుతంగా ఉంది. జీవితంలో బాధ అనేది సహజమని ఈ హైకూ చెబుతుంది. ఒక బంధం ముగిసినా, కొత్త బంధం వైపు ఎలా ప్రయాణించవచ్చో ప్రకృతి మాధ్యమంగా కవి వివరించారు. నేలను ముద్దాడటం అనే ప్రక్రియలో ఒక కృతజ్ఞతా భావం దాగి ఉంది. కవి చూపిన ఈ తాత్విక కోణం ఎంతగానో ఆకట్టుకుంటుంది. మానవ సంబంధాల్లోని సున్నితత్వాన్ని, నగర జీవితంలోని యాంత్రికతపైనా కవి హైకూలు రాశారు. మరొక చోట కవి ఇలా అంటారు.
‘ఫోన్ తెరపైనే బంధాలు / గది వలలో / ఏడుస్తున్న అవ్వ’ అని. సాంకేతికత నానాటికీ పెరుగుతున్న కాలంలో మనుషుల మధ్య దూరం ఎలా పెరుగుతుందో ఈ పంక్తులు అద్దం పడతాయి. ఆత్మీయతలన్నీ డిజిటల్ తెరలకే పరిమితమవుతున్న వైనాన్ని కవి ఈ హైకూ కళ్లకు కట్టారు. ఇంట్లోని పెద్దవారిని నిర్లక్ష్యం చేసే ఆధునిక సమాజ పోకడను ఈ హైకూ సూటిగా ప్రశ్నిస్తుంది. కన్నవారి ఒంటరితనాన్ని, వారి మనోవేదనను చాలా హృదయవిదారకంగా కవి ఇక్కడ రికార్డు చేశారు. వ్యవసాయ రంగంలో రైతు పడే ఆవేదనను సైతం చిత్తలూరి తన కవితల్లో ప్రతిబింబించారు. ‘నెర్రెలు వారిన భూమి / రైతు కంటి తడికి / కరిగిపోని మట్టి’. ఈ పంక్తులు అన్నదాతల కష్టాలను ఎంతో ప్రతిభావంతంగా చాటిచెబుతాయి.
మొత్తానికి ‘లాంతరు గ్లాసు’ సంకలనం మొదటి నుంచి చివరి వరకు ఒకే ధారగా సాగింది. కవి ఎక్కడా అనవసరమైన ఆర్భాటాలకు వెళ్లలేదు. చాలా సరళమైన పదజాలాన్ని ఉపయోగించారు. సమాజంపై కవికి ఉన్న అవగాహన, బాధ్యత ఈ పుస్తకంలో ప్రస్ఫుష్టంగా కనిపిస్తాయి. చిన్న చిన్న వాక్యాలతో, సూటిగా సాగిన హైకూలు పాఠకుల మనసులపై ముద్ర వేస్తుంది. చీకటిని చీల్చే లాంతరు వెలుగులా ఈ సంకలనం సమాజాన్ని జాగృతం చేస్తుంది. ప్రకవిత్వ ప్రేమికులు తప్పక చదవాల్సిన అద్భుతమైన సంకలనం ఇది.
విశ్వ ప్రతులకు సంప్రదించాల్సిన నంబర్లు 91338 32246, 8247 432521






