8 July, 2026 | 8:19 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

గ్రీన్‌కో ప్రాజెక్టులకు ప్రోత్సాహం!

13-06-2025 01:15 AM
  1. వాటితోనే వాతావరణ సమస్యలకు అసలైన పరిష్కారం
  2. ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే.. 
  3. మంచినీటి లభ్యత 4శాతమే 
  4. సుస్థిర పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు
  5. 2030నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని సాధించడమే లక్ష్యం
  6. గ్రీన్ కో-2025 సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలైన వాతావరణ సంక్షోభం భవిష్యత్‌లో ఉండకపోవచ్చని, గ్రీన్ కో ప్రాజెక్టులే వాతావరణ సంక్షోభానికి అసలైన పరిష్కారమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గ్రీన్ కో ప్రాజెక్టులకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశా రు.

గురువారం కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), గ్రీన్ కో సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ కో-2025 సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. దేశంలో మొట్టమొదటి గ్రీన్ కో రేటెడ్ ప్లాంట్  భద్రాచలంలోని ఐటీసీ పీఎస్‌పీడీ ప్లాంటేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటివి 1,500కి పైగా ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు.

ప్రపంచ జనాభాలో 18 శాతం మన దేశంలోనే ఉన్నారని, కానీ ప్రపంచంలోని మంచినీటి వనరుల్లో కేవలం 4 శాతం మాత్రమే భారతదేశంలో ఉన్నాయని, ఈ పరిస్థితి నీటి లభ్యతపై మరింత ఒత్తిడిని కలిగిస్తుందని వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్బన్‌డైయాక్సైడ్ ఉద్గారం చేయటంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచిందన్నారు.

కానీ పారిస్ ఒప్పందంలో భాగంగా వాతావరణ కార్యాచరణ లక్ష్యాలకు కట్టుబడి ఉన్నామని, 2070 కల్లా నెట్ జీరో సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. 2030 నాటికి 50 శాతం ఎనర్జీ అవసరాలను పునరుత్పాదక వనరుల నుంచి సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇండస్ట్రీ, పాలసీ సమన్వయంతోనే  క్షేత్రస్థాయిలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, ఈ ప్రక్రియలో గ్రీన్ కో రేటింగ్ ఫ్రేమ్‌వర్క్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

సుస్థిరమైన పారిశ్రామికాభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2030నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్‌ఎనర్జీని సాధించే లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతోపాటు రూ. 12,600కోట్లతో ఇందిరా సోలార్ గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించి గిరిజన రైతులకు చేయూతనందిస్తామని పేర్కొన్నారు.