11 July, 2026 | 1:52 AM

చెన్నకేశవస్వామి ఆలయ భూమి కబ్జా

11-07-2026 12:00 AM
  1.   33 ఎకరాలను లాక్కున్న రెడ్డి కుటుంబం
  2. విడిపించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 33 ఎకరాల భూమి 30 సంవత్సరాలుగా కబ్జాకు గురైందని టీఆర్పీ రాష్ట్ర నాయకులు, మాజీ మావోయిస్టు పిట్టల శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్థులు టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. దేవస్థానానికి చెందిన భూమిలో సుమారు 2 ఎకరాలు జూరాల కాలువ నిర్మాణంలో పోయిందని తెలిపారు.

మిగిలిన 30 ఎకరాల భూమిని పుట్ట గంగిరెడ్డి (రిటైర్డ్ ఏఈ) కుటుంబం గత 30 సంవత్సరాలుగా స్వాధీ నం చేసుకుని వరి సాగు చేస్తూ వస్తోందని ఆరోపించారు. ఇందులో సుమారు 4 ఎకరాల మామిడి తోట కూడా ఉండగా, దానిని సైతం నరికివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేవస్థానానికి చెందిన ఈ భూమి నుంచి ప్రతి సంవత్సరం భారీ ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ, దేవాలయ అభివృద్ధికి, నిత్య పూజా కార్యక్రమాలకు, అర్చకుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా అందడం లేదని చెప్పారు.

ప్రభుత్వ అధికారుల సహకారంతో అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వ కుండా ఎండోమెంట్ శాఖ అధికారులతో కుమ్మక్కు మూడేళ్ల కాలానికి గంగిరెడ్డి కుటుం బం కేవలం రూ.1,30,000కే అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక ఎకరానికి ఏడాదికి రెండు పంటలకు కలిపి సుమారు రూ.30 వేల వరకు కౌలు విలువ ఉందని, ఆ లెక్కన 30 ఎకరాలకు ఏడాదికి రూ.9 లక్షలు, మూడేళ్లకు రూ.27 లక్షలు రావాల్సి ఉండగా, కేవ లం రూ.1.30 లక్షలకు ఒప్పందం చేయడం ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగించే చర్య అని మండిపడ్డారు.

ఈ సమస్యపై ఎండోమెంట్ కార్యాలయం ముందు ధర్నా లు నిర్వహించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. మంత్రులను కలిసి వినతులు ఇచ్చినా, జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సానుకూలంగా స్పందించారు. దేవస్థాన భూముల విషయంలో అక్రమాలు జరిగితే వాటిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

సంబంధిత ఎండో మెంట్ శాఖ అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే ఎండోమెంట్ శాఖ మంత్రిని కూడా కలిసి ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు. దేవస్థానానికి చెందిన భూమి ప్రజల ఆస్తి అని, ప్రజలకు చెందాల్సిన హ క్కును ప్రజలకు అందేలా చేయడం తన బాధ్యతేనని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మాజీ మావోయిస్టు ఎత్తం కృష్ణయ్య (అలియాస్ జనార్ధన్), మాధాపురం మల్లయ్య, దండోరా జిల్లా కోశాధికారి నాగరాజు, అం బేద్కర్ సంఘం యువజన సంఘం అధ్యక్షుడు గడ్డాల రాముడు, గడ్డమీద గోపాల్, ముత్యాలు, ఎత్తం వెంకటేష్, ఎల్లన్న, అనుకాల రాముడు, కృష్ణ, ఆంజనేయులు, గంగు లు, మహేష్, కత్తి నర్సింహ పాల్గొన్నారు.