30 June, 2026 | 1:42 AM

కబ్జాలతో కష్టాలు వరద నీటి ప్రవాహానికి ఆటంకాలు

30-06-2026 12:00 AM

హైడ్రా ప్రజావాణికి 54 ఫిర్యాదులు

సికింద్రాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): కబ్జాలతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పార్కు స్థలాన్ని కబ్జా చేసి కాలనీవాసులు సేదదేరేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పక్కనే వరద కాలువ ఉన్నా కారు పార్కింగ్ పేరిట కబ్జాలు చేసి కాలనీ వరదకు కారణమౌతున్నారని మరో ఫిర్యాదు.

ఉన్న దారిలో 10 అడుగుల మేర కాలనీ రహదారులను కబ్జా చేసి రాకపోకలకు ఇబ్బందులు పెడుతున్నారని సోమవారం హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మహేంద్రహిల్స్ వార్డు నంబరు 5లో ఉన్న వరద కాలువకు కాలనీ దారులలోంచి వెళ్లాల్సిన వర్షపు నీరు వెళ్లకుండా అక్కడి వారు ఆటంకాలు సృష్టిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో మహేంద్రహిల్స్లో రహదారులు చెరువుల్లా మారుతున్నాయని పేర్కొన్నారు.