ఈర్ల సమ్మయ్యకు జాతీయ స్వర్ణనంది అవార్డు
ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల టీచర్‌కు దక్కిన అరుదైన గౌరవం
సుల్తానాబాద్ , జూన్ 29 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు 2025-26 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి స్వర్ణ నంది అవార్డు లభించింది. జూన్ 28, 2026 రాత్రి వేద రూరల్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, వేద ఎన్జీవో, ఎంఎఎంకె ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో కొమురవెల్లిలో నిర్వహించిన జాతీయస్థాయి స్వర్ణ నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, అవార్డును అందుకున్నారు.
సామాజిక సేవ, విద్యాభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, యువతను ప్రోత్సహించడం, సమాజ సంక్షేమం కొరకు ఈర్ల సమ్మయ్య చేస్తున్న కృషిని, అతని విశిష్ట సేవలను గుర్తించిన నిర్వాహకులు జాతీయ స్వర్ణ నంది అవార్డు పత్రం, జ్ఞాపిక, పూలమాల, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈర్ల సమ్మయ్యకు జాతీయస్థాయి స్వర్ణనంది పురస్కారం రావడం పట్ల, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు విద్యార్థినీ, విద్యార్థులు గ్రామస్తులు, మండలం, జిల్లాలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను కొనియాడుతూ పలువురుఅభినందిస్తున్నారు.






