26 March, 2026 | 2:51 AM

కాగ్ లెక్కల్లో కన్నీటి వెతలు

26-03-2026 12:00 AM

తీన్మార్ మల్లన్న :

తెలంగాణ ప్రజలారా.. తాజాగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క చదివిన బడ్జెట్ ప్రసంగం విన్నా రా? ‘సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి, ఆక్స్‌ఫర్డ్ స్థాయి వర్సిటీలు, మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ‘ అంటూ ఒకటే కవిత్వం.. కమ్మటి కత లు!  వినడానికి రెండు చెవులూ చాలలేదు. కానీ, కాగితాల మీద కట్టిన ఈ కోటల వెనుక దాగిన పచ్చి నిజమేంటో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఆడిట్ సంస్థ అయిన కాగ్ నివేదికలు తీసి చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.

గడచిన పదేళ్లలో ఈ రాష్ట్రాన్ని పాలించిన పెద్దలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్ని పచ్చి ద్రోహా లు చేశారో, లక్షల కోట్లు అప్పులు తెచ్చి బ డ్జెట్ నిధులను ఎలా మురగబెట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపారో చూస్తే.. ప్రతి తెలం గాణ బిడ్డ గుండె రగిలిపోతుంది. కాగ్ అ కౌంట్స్ రిపోర్టుల్లో బట్టబయలైన అంకెల గారడీని, వృథా ఖర్చులను ఇవాళ నేను మీ ముందు పెడుతున్నాను.

ఈ నిజాలు చూశాక ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టా లి, ప్రజలు ఆలోచించాలి! ఓట్ల కోసమే మో బీసీలు కావాలి.. కానీ, నిధుల విషయానికి వస్తే మాత్రం మొండిచెయ్యే! గత పదేళ్లలో బీసీల కోసం అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించినట్లే కేటాయించి, ఏకంగా రూ.8,462 కోట్లను ఖర్చు చేయకుండా ఈ ప్రభుత్వాలు వెనక్కి లాగేసుకున్నాయి.

బీసీ విద్యార్థుల పోటీ పరీక్షల శిక్షణ (స్టడీ సర్కిళ్లు) కోసం పెట్టిన రూ.25 కోట్లు, చిన్న పిల్లల ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం పెట్టిన రూ.4.26 కోట్లు, సంచార జాతుల (ఎంబీసీ) అభివృద్ధి కోసం పెట్టిన రూ.57.63 కోట్లను ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వంద శాతానికి వంద శాతం వెనక్కి తీసుకుని బీసీల భవిష్యత్తును నాశనం చేశారు. 

ఉచిత కరెంటుకు సున్నా..- దళిత బంధు స్వాహా! 

దళితులు, గిరిజనులకు చట్టబద్ధంగా దక్కాల్సిన రూ. 24,445 కోట్ల సబ్-ప్లాన్ నిధులను ఈ ప్రభుత్వాలు ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించాయని ఆర్థిక మంత్రి స్వయంగా ఒప్పుకున్నారు. 2023 కాగ్ నివేదిక ప్రకారం, దళిత బంధు కోసం ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించినట్లు చూపించి.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వంద శాతం నిధులను సరెండర్ చేశారు. అంతకంటే దారుణం ఏంటంటే.. దళిత, గిరిజన గృహాలకు ఇచ్చే ఉచిత కరెంటు పథకానికి తాజా 2026--27 బడ్జెట్ (డిమాండ్ 21, 22) లో ఏకంగా సున్నా కేటాయింపులు చేసి ఆ పథకాన్నే ఎత్తేశారు.

ఇదా మీరు దళితులకు చేసే మేలు? కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే ఇంజినీరింగ్ అద్భు తం’ అని గత ప్రభుత్వం డబ్బా కొట్టుకున్నది కదా? కాగ్ పెర్ఫార్మెన్స్ ఆడిట్ ప్రకా రం.. అక్షరాలా రూ.86,788 కోట్లు ఖర్చు పెట్టి మార్చి 2022 నాటికి వీళ్లు కొత్తగా నీళ్లిచ్చిన ఆయకట్టు ఎంతో తెలుసా? కేవలం 40,288 ఎకరాలు మాత్రమే! అం టే.. ఎకరా సాగుకు రూ.2 కోట్ల చొప్పున ఖర్చు పెడతారా? మోటార్ల ధరలు పెంచేసి ఎస్కలేషన్ పేరుతో కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.1,342 కోట్లు దోచేశారు.

మరీ దారు ణం ఏంటంటే.. కనీస సర్వేలు చేయకుండా కాళేశ్వరం ప్యాకేజీ-5 కింద సింగరేణి బొగ్గు గనుల గుండా 18 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. గనుల కింద తవ్వితే ప్రాణాలకే ప్రమాదమని సింగరేణి అభ్యంతరం చెప్పడంతో పనులు రద్దు చేశారు. కానీ, అప్ప టికే కమీషన్ల కక్కుర్తి వల్ల ఏకంగా రూ. 897.73 కోట్ల ప్రజాధనం మట్టిపాలైంది. పోయిన ప్రజాధనాన్ని వసూలు చేయాల్సింది పోయి, ప్యాకేజీ -21 లో వృథా అయిన రూ. 29.13 కోట్లను సిగ్గులేకుండా మాఫీ చేయాలని ప్రతిపాదనలు పంపారు.

పసిపిల్లల నోటికాడ గుడ్డు కూడా

2023--24 లో అట్టహాసంగా ‘ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ స్కీం‘ అని చెప్పి రూ. 100 కోట్లు బడ్జెట్లో పెట్టారు. తీరా ఖర్చు చేసింది ఎంత అంటే.. కేవలం రూ. 70 లక్షలు మాత్రమే. మిగతా రూ.99.29 కోట్ల ను మురగబెట్టారు. బడిపిల్లలకు మధ్యా హ్న భోజనంలో గుడ్లు ఇవ్వడానికి పెట్టిన పద్దులో ఏటా రూ.40 కోట్ల నుండి రూ. 59 కోట్ల వరకు లాగేసుకున్నారు. ఇక గర్భిణుల రక్తహీనత పోగొట్టే కేసీఆర్ న్యూట్రి షన్ కిట్ కోసం రూ. 150.94 కోట్లు కేటాయించి ఒక్కటంటే ఒక్క రూ పాయి ఖర్చు చేయకుండా 100% వెనక్కి తీసుకున్నారు.

పసిపిల్లల నోటికాడ ముద్ద, బాలింతల పౌష్టికాహారం మింగేసే ఈ రాబందులకు పాలన చేసే హక్కు ఉందా? ప్రభుత్వం లక్షలాది పోస్టులు ఖాళీగా ఉంటే భర్తీ చేయ దు. కాగ్ రిపోర్టుల్లో ప్రతి పేజీలోనూ ‘ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనం దున బడ్జెట్ కోత పెట్టాం’ అనే సాకే కనిపిస్తుంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల రెన్యువల్ ఉత్తర్వులను కావాలనే నెలల తరబడి పెండింగ్‌లో పెట్టి, ఆ నెపంతో వాళ్ల జీతాల నిధులను వందల కోట్లలో లాప్స్ చేస్తున్న కిరాతక విధానం కాగ్ సాక్షిగా బయటపడింది.

ఆర్టీసీకి వేల కోట్లు ఇస్తున్నామంటూనే బస్ పాస్ రాయితీలు ఇవ్వకుండా, పీఎఫ్, సీసీఎస్ డబ్బు లను సైతం సంస్థ వాడుకునేలా చేసి ఆర్టీసీని ఉరితీశారు. అసంఘటిత రంగ కార్మి కుల (ఆటో డ్రైవర్లు, హమాలీలు) సామాజిక భద్రతకు పెట్టిన నిధులను పదేళ్లుగా వందకు వంద శాతం వెన క్కి తీసుకుంటున్నారు. 2023--24లో పం టల బీమాకు (రూ. 171.51 కోట్లు), వ్యవసాయ యంత్రీకరణకు (రూ. 377.35 కోట్లు) పెట్టిన బడ్జెట్‌ను 100% లాప్స్ చేశారు.

2019--20లో రుణమాఫీ కోసం సప్లిమెంటరీ బడ్జెట్లో రూ.4,528 కోట్లు పెట్టి, అందులో ఏకంగా రూ.3,828 కోట్ల ను నిర్దాక్షిణ్యంగా కోత పెట్టారు. ఇక నిరుపేదల డబుల్ బె డ్రూం ఇళ్ల కలకు సంబంధించి ఒక్క 2023--24 సంవత్సరంలోనే ఏకంగా రూ. 11,000 కోట్ల బడ్జెట్‌ను వంద శాతం (100%) వెనక్కి లాగేసుకున్న ప్రభుత్వం ఇది. గ్రామీణ అభివృద్ధికి గుండెకాయ లాంటి గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన ఎస్‌ఎఫ్‌సీ నిధుల్లో ఏకం గా రూ.1,132 కోట్లు సరెండర్ చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదు.

ప్రజలారా ఆలోచించండి

ప్రభుత్వ పెద్దల కళ్లబొల్లి మాటలతో, కాగితాల మీద కట్టిన కోటలతో నిండిన ఈ బడ్జెట్ ఒక పవిత్రమైన డాక్యుమెంట్ కాదు.. ఇది ప్రజలను నిలువునా మోసం చేసే ఫ్రాడ్ డాక్యుమెంట్! వైద్య రంగానికి దేశ సగటు 6.2 శాతం ఉంటే, తెలంగాణలో కేవలం 4.6 శాతం ఇచ్చి ప్రజల ప్రా ణాలతో చెలగాటం ఆడుతున్నారు. యూ నివర్సిటీలకు ఫ్రాడ్ డాక్యుమెంట్! వైద్య రంగానికి దేశ సగటు 6.2 శాతం ఉంటే, తెలంగాణలో కేవలం 4.6 శాతం ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా రు.

యూనివర్సిటీలకు పెట్టిన రూ.500 కోట్లు 100% వెనక్కి తీసుకుని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ రేంజీ అని మభ్యపెడుతున్నారు. ఈ అసమర్థ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయా లి. దారి మళ్లించిన రూ.24 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్ నిధులపై, బీసీల కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సింగరేణి కింద సొరంగం తవ్వి వృథా చేసిన రూ.897 కోట్లను, కాళేశ్వరం కాం ట్రాక్టర్లకు దోచిపెట్టిన నిధులను అధికారుల ఆస్తులు అమ్మి ముక్కుపిండి వసూ లు చేయాలి. లేదంటే ఈ తెలంగాణ సమా జం ఊరుకోదు. 

 వ్యాసకర్త: టీఆర్పీ అధినేత