సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
8 డిమాండ్లలో ఆరింటికి ప్రభుత్వం ఓకే
నేటి ఉదయం నుంచి విధుల్లోకి జూడాలు
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టమైన హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమణకు అంగీకరించారు. ఎనిమిది డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలత వ్యక్తం చేయగా గురువారం నుంచి విధుల్లోకి చేరుతున్నట్లు జూడాలు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం మంత్రుల నివాస సముదాయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ జూనియర్ వైద్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
జూడాల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి వారి ప్రధాన డిమాండ్లను నెరవేర్చామని మంత్రి వెల్లడించారు. విద్య, వైద్యంపై తమ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఉందని అందుకే జూనియర్ వైద్యుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారు మొదటి నుంచి కోరుతున్న ప్రధాన డిమాండ్ స్టుఫైండ్స్ గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లించాలని కోరారని, అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ మేరకు అవసరమైన నిధులు రూ.406 కోట్లను విడుదల చేశామని వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి విడుదల చేసిన జీవోను మంత్రి మీడియాకు ప్రదర్శించారు.
కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి 79.50 కోట్లు, కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, తీర్పు అనంతరం అక్కడ నూతన భవనం నిర్మిస్తామని మంత్రి జూడాలకు తెలిపారు. జూడాల సమస్యల పరిష్కారం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడించారు.
ఆరోగ్య తెలంగాణకు కట్టుబడి ఉన్నాం...
ఆరోగ్య తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని, నిరుపేదలకు సైతం మెరుగైన వైద్యం అందించడమే తమ ధ్యేయమని రాజనర్సింహ వెల్లడించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత కేవలం 10 రోజుల వ్యవధిలో ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కారించామన్నారు. పేదలు జిల్లాల నుంచి హైదరాబాద్ రాకుండా అక్కడే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ బృందాలు జరిపిన దాడుల వల్ల అనేక హోటళ్లలో తిరిగి నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వచ్చిందన్నారు.
ఇదే మాదిరిగా క్లినికల్ ఎష్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. మొబైల్ ఫుడ్ సేఫ్టీ వాహనం, మొబైల్ డ్రగ్స్ ల్యాబ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రైవేటు హాస్పిటళ్లు సైతం జవాబుదారీతనం వహించాలని లేదంటే చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం వచ్చే వారం ఢిల్లీ వెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1,100 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మిగతా సమస్యలపైనా కేంద్ర మంత్రితో చర్చించనున్నట్లు వెల్లడించారు.
కృతజ్ఞతలు తెలిపిన జూడాలు...
గ్రీన్ చానెల్‌తో పాటు మిగతా సమస్యలన్నింటినీ తీర్చినందుకు, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి రాజనర్సింహతో పాటు వెంటనే నిధులను విడుదల చేసిన డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జూనియర్ డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా జూడాలు సైతం సమ్మె విమరిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం నుంచి తిరిగి రెట్టించిన ఉత్సాహంతో విధులు నిర్వహిస్తామని జూడాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీహర్ష తెలిపారు. గ్రీన్ చానెల్ ద్వారా స్టుపెండ్స్, నూతన వసతి గృహాల నిర్మాణం, కేఎంసీలో రోడ్ల నిర్మాణం, త్వరలో సూపర్ స్పెషాలిటీ వైద్యులకు గౌరవ వేతనం పెంపునకు అంగీకారం, త్వరలో మెడికల్ కాలేజీ విద్యార్థులకు బస్సు సౌకర్యం, భద్రతకు సంబంధించి త్వరలో పోలీసు అధికారులతో చర్చలకు అంగీకరించినట్లు శ్రీహర్ష వెల్లడించారు.
పరిష్కారమైన సమస్యలు
- గ్రీన్ చానెల్ ద్వారా స్టుపెండ్ చెల్లింపునకు రూ.406 కోట్ల విడుదల
- ఉస్మానియా, గాంధీ కళాశాలల్లో నూతన వసతి గృహాల నిర్మాణం కోసం నిధుల విడుదల
- కేఎంసీలో రోడ్ల నిర్మాణం కోసం నిధుల విడుదల
- త్వరలో సూపర్ స్పెషాలిటీ వైద్యులకు గౌరవ వేతనం పెంపునకు అంగీకారం
- త్వరలో మెడికల్ కాలేజీ విద్యార్థులకు బస్సు సౌకర్యానికి స్పష్టమైన హామీ
- భద్రతకు సంబంధించి త్వరలో పోలీసు అధికారులతో చర్చలకు ప్రభుత్వ నిర్ణయం
కానివి
- తెలంగాణలో ఏపీ విద్యార్థులకు 15% సీట్ల రిజర్వేషన్ల తొలగింపు
- ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కోసం కొత్త భవన నిర్మాణం






