22 July, 2026 | 2:51 AM

ఉపాధి హామీ పనులపై విచారణ

02-06-2024 12:05 AM

జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలి

జహీరాబాద్, జూన్ 1: జహీరాబాద్ మండలంలో ఏడాది పాటు నిర్వహించిన ఉపాధి హామీ పనులపై శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించారు. అడిషనల్ డీఆర్‌డీవో బాలరాజ్ ఆధ్వర్యంలో 14వ బహిరంగ విచారణ కొనసాగింది. 2023 ఏప్రిల్ 1వ తేది నుంచి 2024 మార్చి 31వరకు మండలంలోని గ్రామాల్లో రూ. 5.64కోట్లతో ఉపాధి హామీ పనులు నిర్వహించామని, విటికి సంబంధించి వారం రోజుల పాటు తనిఖీలు, గ్రామ సభలను నిర్వహించినట్టు స్టేట్ రిసోర్స్‌పర్సన్ బాలు వివరించారు. గ్రామాల వారీగా నమోదు చేసుకున్న వివరాలను డీఆర్‌పీలు బహిరంగ విచారణలో వెళ్లడించారు.

ఉపాధి హామీ పనుల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, చేపట్టిన పనులకు హాజరు సక్రమంగా నమోదు చేయక, సరైన కొలతలు తీయకపోవడంతో చేసిన పనికి సరైన డబ్బులు రాక కూలీలు నష్టపోవడం, అవెన్యూ, కమ్యూనిటీ ఫ్లాంటేషన్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం ఫలితంగా సర్వైవల్ రేటు తగ్గిపోవడం తదితర అంశాలను అడిట్ బృందం గుర్తించింది. రికార్డులు సరిగ్గా నిర్వహించకపోవడం, ఫొటోల నిర్వహణ చేయకపోవడం, కూలీలకు ఫే స్లిప్‌లు ఇవ్వకపోవడం వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ విధుల నిర్లక్ష్యంలో భాగంగా గుర్తించి పలువురు అధికారులు, సిబ్బందికి నోటీసులు ఇవ్వడమే కాకుండా జరిమానాలను విధించారు.

అనంతరం అడిషనల్ డీఆర్‌డీవో బాలరాజ్ మాట్లాడుతూ మండలంలో నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండాలని, మొక్కలు పెంపకంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎండలకు ఎండకుండా నర్సరీలు గ్రీన్ షెడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కింద పనులను కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ కింద చేపట్టిన పనులు కొలతల ప్రకారం ఉండాలని, అవి కూడా నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏవీవో నాగేశ్వర్‌రావు, ఫ్లాంటేషన్ మేనేజర్ మణికుమార్, అంబుడ్‌మేన్ భోజిరెడ్డి, ఎంపీవో మహేశ్, ఏపీవో అశోక్‌కుమార్ పాల్గొన్నారు.