24 July, 2026 | 2:15 AM

ఒక వ్యక్తికి ఒకే ఓటు

24-07-2026 12:59 AM

ఎన్యుమరేషన్ ఫారాలు వెంటనే బీఎల్‌ఓలకు అందజేయాలి

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, జూలై 23 (విజయక్రాంతి): జిల్లాలో రెండు చోట్ల ఓటు హక్కు నమోదైన (డబుల్ ఓటర్లు) వారు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకుని, మరో ప్రాంతంలోని ఓటును తొలగించేందుకు అవసరమైన ఎన్యుమరేషన్ ఫారాలను రెండు, మూడు రోజుల్లోగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అంశాలపై గురువారం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ ఓటు కొనసాగించాలనుకుంటున్నారో సంబంధిత ఓటర్లు వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ఈ అంశంపై రాజకీయ పార్టీలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో ఓటరు జాబితాలో ఉన్న లోపాలు గణనీయంగా తగ్గాయన్నారు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా 2025 ఓటరు జాబితా ప్రకారం 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలను మాత్రమే పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదన ఉందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రొఫార్మాలను ఇప్పటికే రాజకీయ పార్టీలకు అందజేశామని చెప్పారు. ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణలో నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రు, ఆర్డిఓ జగదీశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రాకేష్, బండి దత్తాత్రేయ, గుడిపల్లి నగేష్, మహమ్మద్ జకరియా, దీపక్, ఆకుల రాము తదితరులు పాల్గొన్నారు.