calender_icon.png 2 December, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటా కేటాయింపులో తప్పులు

02-12-2025 01:54:11 AM

-బీసీ కమిషన్ మాటను వినరా?

-కేంద్రాన్ని విమర్శించడం తగదు

-తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య

-ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు బీసీల ఆత్మ గౌరవధర్మ పోరాట ర్యాలీ 

-హాజరైన మాజీ స్పీకర్ మధుసూదనాచారి

ముషీరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాం తి): బీసీ రిజర్వేషన్‌లను తగ్గించి మోసం చేస్తూనే, తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని చెప్పుకోవడం సిగ్గు చేటు, నయవంచన అని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్రంగా విమర్శించారు.

ఒక వైపు బీసీ రిజర్వేషన్లల కేటాయింపులలో అవకతవకలు జరిగాయని, రిజర్వేషన్ల శాతం తగ్గిందని, అందుకే వెంటనే ఎన్నికలు వాయిదా వేసి సరిదిద్దాలని రాష్ట్ర బీసీ కమిషన్ తెలిపినప్పటికీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరించడం అప్రజాస్వామికమన్నారు. ఇది రేవంత్ ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. సోమవారం నగరంలోని ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు బీసీల ఆత్మ గౌరవధర్మ పోరాట ర్యాలీని భారీఎత్తున్న నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ.. ప్రభుత్వం వెంటనే ఎన్నికలను వాయిదావేసి, 42% బిసి రిజర్వేషన్ల అమలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం బిసిల ఆత్మగౌరవానికి, మనోభావాలకు భంగం కలిగిస్తూ, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుం దని ఆయన మండిపడ్డారు.

ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు శ్రీలంక, బంగ్లా దేశ్, నేపాల్ లాంటి పలు దేశాలలో ఏం జరిగిందో రేవంత్ ప్రభుత్వం గమనంలో ఉంచు కోవాలని కృష్ణయ్య హితవు పలికారు. అసెం బ్లీ తీర్మానం చేసిన తర్వాత అఖిలపక్షాన్ని ప్రధానమంత్రిని కలవడానికి తీసుకు వెళ్లలేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రెండేళ్లు డ్రామా నడిపి, ఇప్పుడు ఇవ్వలేమని చేతులు ఎత్తివేయడం దుర్మార్గమని విమర్శించారు. 

మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి ప్రసంగిస్తూ.. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని, 42శాతం అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. చట్టసభలను, హైకోర్టును, ప్రజలను తప్పుదోవపట్టిస్తూ, రేవంత్ ప్రభుత్వం నియం తృత్వ వైఖరితో పాలన కొనసాగిస్తున్నదని ఆయన ఆరోపించారు.

ప్రజాపాలన కొనసాగిస్తున్నామని గొప్పలు చెప్పుకునే రాష్ట్రప్ర భుత్వం మెజారిటీ బిసి వర్గాల ప్రయోజనాలను కాలరాయడమే ప్రజారంజకమా? అని ఆయన ప్రశ్నించారు. బీసీ సంక్షేమ సం ఘం జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్  ర్యాగ రుషి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాల్సింది పోయి రహస్య ఎజెండాలతో కీడుచేసే పనులను చేపడుతున్నదని ఆయన ఆరోపించారు.

ఈ ర్యాలీలో సంఘీభావంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, బీసీ కుల, విద్యార్ధి, మహిళా, యువజన, ఉద్యోగ సంఘాలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు  పాల్గొన్నారు. బీసీ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ మోడీ రాందేవ్‌ల నాయకత్వంలో ర్యాలీ చేపట్టారు.