రాష్ట్రంలో ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్

08-05-2024 01:44:46 AM

బీఆర్‌ఎస్ అక్రమాలపై కాంగ్రెస్ మౌనం

మోసంతోనే అధికారంలోకి కాంగ్రెస్

సీఎం భాష సంస్కారహీనంగా ఉంది

4 నెలల్లోనే సీఎంగా రేవంత్ వైఫల్యం 

6 గ్యారెంటీలు సాధ్యం కావని ముందే చెప్పా

మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఈటల రాజేందర్

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కమిటీలతో కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతూనే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ వైఫల్యాలు బయటికి వచ్చేందుకు చాలా కాలం పట్టిందని, రేవంత్‌రెడ్డి కేవలం 4 నెలల్లో తేలిపోయారని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంగళవారం ఈటల మాట్లాడారు. అవగాహనతో కాకుండా మోసం చేసేందుకే హామీలు ఇచ్చి రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు సాధ్యం కాదని మొదట చెప్పింది తానేనని ఈటల గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి అబద్ధాల కోరు అని, అధికారంలోకి వచ్చాక అహంకారం పెరిగిందని, సీఎం అయినా భాష మారలేదని మండిపడ్డారు.

మార్ఫింగ్‌లో ఘనులు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి రిజర్వేషన్లనే రద్దుపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు మోసంలో ఘనులని ఈటల అన్నారు. మరో వీడియోలో మల్కాజిగిరి ప్రజలు తాగుబోతులు అని తాను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని, తాను ఏనాడు అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదని తెలిపారు. వీడియోలు, ఆడియోలు మార్ఫింగ్ చేయడంలో రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ను మించిపోయారని మండిపడ్డారు. ఎన్ని చేసినా భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకునే రైతు భరోసా నిధులు విడుదల చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. 

కేసీఆర్ మనుషులుగానూ చూడలేదు

కేసీఆర్ మంత్రులను మనుషులుగా కూడా చూడలేదని అన్నారు. కొరకరాని కొయ్యగా ఉన్నాననే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారని తెలిపారు. హుజూరాబాద్ వ్యక్తికి మల్కాజిగిరిలో ఏం పని అంటున్నారని, కేటీఆర్, హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి వారి నియోజకవర్గాల్లో స్థానిక వ్యక్తులా అని ప్రశ్నించారు. తనకు మల్కాజిగిరిలో ఉన్న ప్రజాభిమానం వీరికి తెలియదన్నారు. రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ కాదని, ఎస్సీ వర్గీకరణకు బీజేపీయే ముందుకు వచ్చిందన్నారు. ఈడబ్ల్యూఎస్ ద్వారా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించామని, ముస్లింలకూ ఈ కోటాను వర్తింపజేస్తామని తెలిపారు. సోనియాగాంధీ హయాంలోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. త్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల కష్టాలకు ప్రధాని మోదీ ఫుల్‌స్టాప్ పెట్టారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎవరో కూడా మల్కాజిగిరిలో తెలియదని, తనకు ఇద్దరూ పోటీయే కాదని ఈటల అన్నారు.