కేసీఆర్ రెండేళ్లు మాట్లాడలేదు

08-05-2024 01:48:04 AM

మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్

ఆగస్టు 15లోపు రుణమాఫీకి నిధులెలా వస్తాయి?

మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు రెండేళ్లపాటు అప్పటి సీఎం కేసీఆర్ తనతో మాట్లాడలేదని బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కేసీఆర్ రాజ్యాంగ సంస్థలను గౌరవించలేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలు, గ్యారెంటీలను అమలు చేయలేక వాయిదాలు వేస్తోందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మంగళవారం మాట్లాడుతూ.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, అందుకు సరిపడా నిధులను ఎక్కడ నుంచి సమకూరుస్తారోననే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటేస్తే ప్రధాని ఎవరు అవుతారో కూడా చెప్పే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రధానిగా మూడోసారి నరేంద్రమోదీనే ఎన్నుకో వాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

తెలంగాణలో బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తుందని, ఎక్కువ మందికి కేంద్రమంత్రులుగా అవకాశం లభిస్తుందని చెప్పారు. తమిళనాడులోనూ తాము డబుల్ డిజిట్ సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారతానికి గేట్ వే లాంటి తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందని, తెలంగాణ సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ పనిచేయలేదని, వారికి ఈ ఎన్నికల్లో ప్రజల ఆదరణ లభించదని అన్నారు. చీర కట్టుకుని ఆర్టీసీ బస్సులో ఎక్కాలంటూ కేటీఆర్, రేవంత్‌రెడ్డి ఒకరినొకరు సవాళ్లు విసురు కుంటున్నారని, మోదీ మాత్రం మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరూ ఊహించని విధంగా మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. రిజర్వేషన్లపై పదేపదే అబద్ధాలు మాట్లాడి భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తోందని, ప్రజలు వారి మాటలను విశ్వసించబోరని తెలిపారు. తెలంగాణ ప్రజల అభిమానం తానెప్పుడూ మర్చిపోలేనిదని ఆమె అన్నారు.