2 May, 2026 | 10:38 PM

ఇథనాల్ పరిశ్రమ మాకొద్దు

10-12-2024 12:23 AM
  1. ప్రజాభిప్రాయం లేకుండానే ఏర్పాటుకు చర్యలు
  2. సూర్యాపేట జిల్లా రావిపహడ్ సమీపంలో కొనసాగుతున్న పనులు
  3. కంపెనీ చుట్టూ 10కి పైగా గ్రామాలు
  4. వేలాది ఎకరాల వ్యవసాయ భూమికి హానీ?

సూర్యాపేట, డిసెంబర్ 9 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కంపెనీపై ప్రజలు, రైతుల వ్యతిరేకత నెలకొంది. మోతే మండలం రావిపహడ్ సమీపంలో ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాభిప్రాయం లేకుండానే ఈ కంపెనీ నిర్మాణానికి గత రాష్ట్ర ప్రభుత్వం 2019లో అనుమతులు జారీ చేసినట్లు సమాచారం.

పంట పొలాల్లో నిర్మిస్తున్న ఈ కంపెనీని సమీప గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల పెట్టుబడితో కంపెనీ నిర్మాణం చేస్తున్నట్లు ప్రచారం. భూగర్భ కలుషితమవుతా యని రైతులు, వాపపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.

ఈ కంపెనీలో ఫ్యూయల్ ఇథనాల్ మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయని రైతులు అంటున్నారు. కానీ ప్రారంభించిన తర్వాత ఏమి తయారు చేస్తారో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. 

వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం!

ఈ కంపెనీ ద్వారా వచ్చే వ్యర్థాలతో పంట పొలాలలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఇథనాల్ తయారీకి బియ్యం, నూకలు, మక్కలు ఉపయోగిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కంపెనీలో రోజుకు లక్ష 50 వేల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి అనుమతులు తీసుకున్నారని తెలుస్తోంది.

ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి సుమారు 10 లీటర్ల నీరు అవసరం. ఈ నీటిని పాలేరు నుంచి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాసెసింగ్ అనంతరం అధిక మోతాదులో వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యర్థాలను భూమిలోకి పంపిస్తే పంటపొలాలు దెబ్బతినే అవకాశముంది. 

విత్తనాల కంపెనీ పేరుతో భూ సేకరణ?

2019లో రావిపాహడ్ సమీపంలో విత్తనాల కంపెనీ పేరుతో రైతుల నుంచి సుమా రు 16 ఎకరాల భూమిని సేకరించినట్లు ప్రచారం జరుగుతున్నది. మరో 16 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధం అవుతున్నారని ప్రచారం. 2022లో కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో సీపీఐ(ఎంఎల్) నాయకులు ఇథనాల్ కంపెనీ అని అందోళన చేపట్టడంతో ఈ విషయం రైతులు చేరింది.

నింబంధనల ప్రకారం గ్రామానికి 10 కిలోమీటర్ల దూరం లో కంపెనీ ఏర్పాటు చేయాలి. ఈ కంపెనీకి సుమారు కిలో మీటర్ నుంచి 1.5 కిలో మీటర్ దూరంలో 10కి పైగా గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మామూళ్లకు కక్కుర్తిప డి అధికారులు అనుమతులు జారీ చేశారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. 

కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలి

రావిపహడ్‌లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలి. ఈ కంపెనీ ఏర్పాటు జరిగితే వేలాది ఎకరాల పంట భూమి నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. వందలాది మంది రైతులు రోడ్డున పడుతారు. అధికారులు స్పందించకపోతే విస్తృత స్థాయిలో ఆందోళనలు చేపడుతాము. 

 ఎర్ర అఖిల్,మాస్‌లైన్ నాయకుడు