15-04-2025 12:00:00 AM
ఏది ఏమైనప్పటికీ తమ దేశం నుంచి అధిక సుంకాలను వసూలు చేస్తున్న ప్రపంచ దేశాల నుంచి అదే స్థాయిలో టారిఫ్‌లను వసూలు చేస్తామని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు మడమ తిప్పుతున్నారు. తొలుత ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రావాల్సిన ప్రతీకార సుంకాల ఆదేశాలను 90 రోజులపాటు నిలిపివేశారు. ఆ వెంటనే టారిఫ్‌ల నుంచి 20 సెక్టార్ల ఉత్పత్తులకు మినహాయింపు కల్పించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలను గమనిస్తే విషయం ఇట్టే అర్థమవుతున్నది.
వాస్తవానికి ఇతర దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై భారీ టారిఫ్‌లను విధించడం వల్ల తమ దేశంలో స్వదేశీ వస్తువుల కొనుగోళ్లు పుంజుకుంటాయని ట్రంప్ భావించారు. అలాగే, అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు పుట్టుకొచ్చి, తమ పౌరులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనేది ట్రంప్ ఆలోచన. అందుకే ముందూవెనకా ఆలోచించకుండా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించేశారు. ఈ క్రమంలోనే చైనాపైనా టారిఫ్‌లు వేశారు.
ట్రంప్ దెబ్బకు ఇతర దేశాలన్నీ కాళ్లబేరానికి వస్తే, చైనా మాత్రం అమెరికా అధ్యక్షుడికి దీటుగా బదులిస్తూ రావడం, దీంతో ఆ దేశంపై అమెరికా మరింత పెద్ద మొత్తంలో సుంకాలు ప్రకటిస్తూ రావడం చకచకా జరిగిపోయాయి. రెండు దేశాల మధ్య జరిగిన సుంకాల యుద్ధం పర్యవసానంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా మార్కెట్లపైనా ఈ ప్రభావం కనిపించింది.
అంతర్జాతీయంగా నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితుల వల్ల మదుపరుల కోట్లాది సంపద ఆవిరైపోయింది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు ఆర్థికమాంద్యం ఛాయలు కనిపించాయి. ట్రంప్ వైఖరిపై ఆయన మద్దతుదారులే బహిరంగంగా పెదవి విరిచారు. దీనికి యావత్ ప్రపంచం సాక్ష్యంగా నిలిచింది. ఇంతా జరిగిన తర్వాత ట్రంప్‌కు తత్వం బోధపడినట్టు అర్థమవుతున్నది.
ప్రపంచ దేశాలు ముఖ్యంగా చైనాతో పంతానికిపోతే అమెరికాకే నష్టమన్న విషయాన్ని ట్రంప్ గ్రహించినట్టు తెలుస్తున్నది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల విషయంలో అమెరికాకు చైనా అతిపెద్ద సరఫరదారుగా ఉంది. గత ఏడాది లెక్కల ప్రకారం చైనా 88 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను, కంప్యూటర్లను అమెరికాకు ఎగుమతి చేసింది. అమెరికన్లు ఉపయోగించే ప్రతి 10 స్మార్ట్‌ఫోన్లలో నాలుగు, అలాగే ప్రతి మూడు కంప్యూటర్లలో ఒకటి చైనాలో ఉత్పత్తి అయిందే.
చైనాలోనే సుమారు 80 శాతం ఐఫోన్లు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో 58 శాతం అమెరికాకే ఎగుమతవుతున్నాయి. దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన ప్లాస్టిక్ కుర్చీలను చైనా నుంచే అమెరికా దిగుమతి చేసుకుంది. అలాగే, పిల్లల ఆటవస్తువులను కూడా అగ్రరాజ్యానికి పెద్దమొత్తంలో చైనా ఎగుమతి చేస్తున్నది. ఇటువంటి తరుణంలో ఆ దేశంపై పెద్ద మొత్తంలో టారిఫ్‌లు అమలు చేస్తే అంతిమంగా అమెరికన్ల జేబులకే చిల్లు పడుతుంది.
ఇప్పటికిప్పుడు అమెరికాలో ఈ వస్తువుల ఉత్పత్తి సాధ్యపడదు. అందుకే ట్రంప్ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గినట్టు అర్థమవుతున్నది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లు, సోలార్‌సెల్, మెమోరీకార్డులు వంటి ఉత్పత్తులను టారిఫ్‌ల నుంచి అమెరికా మినహాయించింది. ఈ నిర్ణయంతో ఫెంటానిల్‌పై 20 శాతం సుంకం మినహా వేరే ఏ ఇతర సుంకాలు చైనాపై భారం మోపలేకపోయాయి.