15-04-2025 12:00:00 AM
తెలంగాణలో నిరుపేదలందరూ సంతృప్తిగా కడుపు నిండా తినాలనే లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. డబ్బులు ఉంటేనే మంచి భోజనం సాధ్యమయ్యే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థద్వారా సన్నబియ్యం పంపిణీ చేయ డం ఒక చారిత్రాత్మక నిర్ణయం. గతంలో రేషన్ దుకాణాల్లో బియ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగానే ఖర్చు చేసినా అవి దొడ్డు బియ్యం కావడంతో ప్రభుత్వ పంపిణీ లక్ష్యం నీరు గారింది. ఈ నేపథ్యం లో దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందిస్తే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని తలచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాదినుండి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది.
చౌకధరల దుకాణాల్లో రేషన్ పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏటా రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5175 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.5489.50 కోట్లు వెచ్చించినా లబ్ధిదారులకు ప్రయోజనం కలగడం లేదు. ప్రభుత్వాలు ఇన్ని కోట్ల రూపా యలు ఖర్చు పెడుతున్నా దొడ్డుబియ్యం కా వడంతో లబ్ధిదారులు ఆసక్తి చూపేవారు కాదు. అయితే, నెలనెలా సరుకులు తీసుకోక పోతే రేషన్ కార్డు రద్దు అవుతుందేమో నని భయంతోనే మొక్కుబడిగా బియ్యం తీసుకునేవారు.
దొడ్డు బియ్యంతో రేషన్ బియ్యంలో అనేక రూపాల్లో అక్రమాలు జరిగి, ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టింది. పోషకాహారం లేక నాణ్యతా లోపంతో ఆ దొడ్డుబియ్యం తినలేక లబ్ధిదారులు బయట ఎవరికో అమ్ముకునే వారు. రేషన్ బియ్యం అక్రమాలతో దళారులు కోట్లకు పడగెత్తారు. రేషన్ షాపు డీలర్లే అమ్మిన బియాన్ని వెనుకకు తీసుకొని కార్డుదారులకు డబ్బులిచ్చిన ఘటనలు, వార్తలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిత్యం కనిపించేవి.
దొడ్డుబియ్యం అక్రమమార్గల్లో విదేశాలకు తరలిపోయేది. కోళ్లకు దానాగా కూడా వేసేవారు. మరోవైపు హోటళ్ల యాజమాన్యాలు బ్లాక్‌లో దొడ్డుబియ్యం కొనేవారు. దొడ్డుబియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్ చేస్తూ అమ్ముతుండడంతో రేషన్ షాపులలో పేదలకు బియ్యం పంపిణీ లక్ష్యం పూర్తిగా విఫలమైంది.
పేదలకు మంచి భోజనం
వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి బియ్యం పంపిణీ చేస్తున్నా ఇటు పేదలకూ ప్రయోజనం లేదు. అటు ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీ మేరకు రేవంత్‌రెడ్డి సర్కార్ రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడంతో నిరుపేదలుకూడా మంచి భోజనం చేయగలుగుతున్నారు. దొడ్డుబియ్యం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా వెచ్చిస్తున్న రూ.5175 కోట్లకు అదనంగా ఇప్పుడు రూ.2852 కోట్లు వ్యయం అవుతున్నది. సన్నబియ్యానికి ఏటా రూ.13523.29 కోట్లు ఖర్చవుతుంటే అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.8033.79 కోట్లు, కేంద్రం రూ. 5489.50 కోట్లు భరిస్తున్నాయి.
ఈ పథకం తో ప్రతి నెల 3.10 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. రేషన్ కార్డులు లేని పేదలకూ సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో లబ్ధిదారుల సంఖ్య పెరగవచ్చు. రాష్ట్రంలో 40 లక్షల నూతన రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించడంతో త్వరలోనే 3.50 కోట్లమందికి సన్నబియ్యం అందనుంది. ఈ పథకంతో ఒక్కో కుటుంబానికి ప్రతి నెల రూ.1200 ఆదా అయ్యే అవకాశాలున్నాయి. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం సరసమైన ధరలకు ఉప్పు, పప్పు, చింతపండు వంటి నిత్యావసర సరుకులూ అందించేందుకు ప్రణాళికలు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పథకం ప్రారంభించిన వెంటనే ఆ ప్రభావం మార్కె ట్లో వ్యాపారులపై పడింది. ఆ షాపుల్లో బియ్యం అమ్మకాలు తగ్గాయి. రేషన్ షాపులలో సన్నబియ్యం అందిస్తుండడంతో మార్కెట్లో బియ్యం ధరలు తగ్గి సామాన్యుడికి ఉపశమనం లభించింది. ఇంతకు ముందు మంచి బియ్యం క్వింటాల్‌కు సు మారు రూ.4000కు అమ్మాల్సి ఉండగా, రూ.5500 నుండి రూ.6500 వరకు అమ్మేవారు.
ఇప్పుడు వాటి ధర రూ.5000 నుండి రూ.6000కు దిగిరావడంతో మధ్యతరగతి కుటుంబాలకు సన్నబియ్యం వ్యవస్థ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక భారం తగ్గింది. నాణ్యమైన బియ్యమంటూ కావేరి, చింట్లు, హెచ్‌ఎంటీ, శ్రీరామ్ వంటి రకాలను ఇంతకాలం అధిక ధరలకు విక్రయించిన వ్యాపారస్తులు ఇప్పుడు రేట్లు తగ్గించేందుకు సిద్ధమవుతున్నారంటే రేషన్ షాపు లలో సన్నబియ్యం పంపిణీయే ప్రధాన కారణం.
ఊపందుకున్న సన్నబియ్యం సాగు
సన్నబియ్యం రేషన్ షాపుల్లో ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించి విజయ వంతమైంది. పంపిణీకి కావాల్సిన బియ్యం సేకరణకు సన్న రకాల సాగును పెంచేందుకూ ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇచ్చిన ఎకరాకు రూ.500 బోనస్ చర్యలు ఫలించాయి. దీంతో రాష్ట్రంలో పంపిణీకి కావా ల్సినంత బియ్యం అందుబాటులోకి వచ్చిం ది.
ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించక ముందు దొడ్డు బియ్యం, సన్న బియ్యం సాగుకు ఒకే మద్దతు ధర ఉండడంతో రైతులు సులభంగా సాగుచేసే దొడ్డు బియ్యం వైపే ఆసక్తి కనబరిచేవారు. వరి ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2300 కాగా, రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు అదనంగా రూ.500 కలపడంతో అన్నదాతలకు రూ.2800 అందుతుంది.
బోనస్ ప్రకటనతో ప్రభుత్వం ఊహించిన దానికంటే సన్న బియ్యం సాగు ఊపందుకుంది. సన్నాలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ.500 బోనస్ కింద రూ.1,206.44 కోట్లు చెల్లించడంతో రాష్ట్రంలో సన్నాల సాగు 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రభుత్వం 2024- ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 4.41 లక్షల రైతుల నుంచి 24 లక్షల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రాష్ట్ర బడ్జెట్లో సన్న బియ్యం బోనస్‌కు రూ.1358.46 కోట్లు కేటాయించారు. కొనుగోలు కేంద్రాలకు అంచనాలకు మించి వస్తున్న సన్నబియ్యం లెక్కలను పరిశీలిస్తే బోనస్‌కు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.2000 కోట్లు దాటే అంచనాలున్నాయి.
సన్న బియ్యం పంపిణీ పక్షం రోజులు పూర్తయిన అనంతరం పరిశీలిస్తే ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతున్నా క్షేత్రస్థాయిలో కొన్ని లోపాలూ కనిపిస్తున్నాయి. దొడ్డుబియ్యం ఇచ్చినప్పుడు వాటిని అమ్ముకునేందుకు ప్రాధాన్యమిచ్చిన లబ్ధిదారులు ఇప్పుడు సన్నబియ్యం పంపిణీతో రేషన్ దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
దీంతో అందని వారు నిరాశ చెందుతున్నారు. మరోవైపు రేషన్ షాపుల్లో సరుకుల కోసం గడువు తేదీనీ పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 90,42,192 రేషన్ కార్డులుండగా, ఇప్పటి వరకు 67,93,876 కార్డులకు సంబంధించి 2,05,41,825 మంది కోసం 1,41,792.95 టన్నుల బియ్యం పంపిణీ కావడంతో రికార్డు స్థాయిలో 15 రోజుల్లోనే 75 శాతం పైగా లబ్ధిదారుల కోటా పూర్తయ్యింది.
మార్గదర్శకం కానున్న పథకం
పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో నూకలతోపాటు కొంత దొడ్డు బియ్యం, ఇతర రకాల బియ్యాలూ కలుస్తుండడంతో అన్నం ముద్ద అవుతుందని ప్రజలు వాపోతున్నారు. పోషకాహారం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం 5 శాతం ప్రోటీన్ రైస్‌కు చెందిన రకాలను నన్న బియ్యంలో కలుపుతుండడంతో అవి ప్లాస్టిక్ బియ్యంలా ఉంటున్నా యని వారు భావిస్తున్నారు.
వీటిపై ప్రభు త్వం ప్రజల్లో అవగాహన కల్పించాలి. మొత్తం మీద సన్నబియ్యంపై అధిక శాతం సానుకూలత వ్యక్తమవుతున్నది. దేశానికే ఆదర్శంగా నిలిచిన సన్న బియ్యం పథకం పేదలకు వరంగా మారిందనడంలో ఎలాం టి సందేహం లేదు. ప్రభుత్వాలు ఎక్కడైనా, ఎప్పుడైనా మంచి పనులు ప్రారంభిస్తే అవి చిరస్థాయిగా నిలిచిపోతూ శాశ్వతంగా ఉండిపోతాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజ నకరంగా ఉన్న ఈ సన్న బియ్యం పథకం కూడా ఆ కోవలోకే చెందుతుంది.
-ఐ.వి.మురళీకృష్ణశర్మ