16-04-2025 12:00:00 AM
తెలంగాణ నిప్పులకుంపటిగా మారుతున్నది. ఏప్రిల్ నెలలోనే ఇంతగా ఎండలు మండుతుంటే మేలో ఎలా వుంటుందో అని భయమేస్తోంది. ప్రజలు పగటిపూట బయటికి రావాలంటేనే వెనుకాడుతున్నారు. కుంపట్లో ఉన్నట్టే ఉంటున్నది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి. అసలే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్. ఉదయం ఎనిమిది గంటలవడంతోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. వడగాలుల బారిన పడకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంది.
ఫంక్షన్ హాళ్లు ఏసీతో ఉంటే ఫరవాలేదు. లేకపోతే, వేడి సెగలతో నరకమే. నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలన్న ప్రజలు వెనుకాడే పరిస్థితి ఉంది. ఏసీ బస్సులో వెళ్లాలంటే అంత పెద్ద మొత్తంలో టిక్కెట్ డబ్బులు వెచ్చించాలి. మధ్యాహ్నం ఒంటిగంట దాటితే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. పొయ్యిలో కూర్చున్నట్టే వుంటున్నది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకూ చేరే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
-కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మూకదాడులను అరికట్టాలి
పార్లమెంటులో వక్ఫ్ చట్ట సవరణల అనంతరం పశ్చిమ బెంగాల్లో చెలరేగిన అల్లర్లు అక్కడి శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నది. సవరణలపై ఆ రాష్ట్రానికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఇదంతా మాని అక్కడి ప్రభుత్వం ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టిన దరిమిలా అల్లర్లు చెలరేగుతున్నట్టు అర్థమవుతున్నది. అల్లర్లు మత ఘర్షణలుగా మారటంతో ఒకే వర్గ ప్రజలు నిరాశ్రయులు కావటం, ఆ రాష్ట్రంలోనే వారు భయాందోళనలతో కాందిశీకులుగా బతకటం నిజంగా అమానవీయం. ఘర్షణలకు పాల్పడే వారిపై ఉదాసీనత పనికి రాదు. మూక దాడులను అరికట్టక పోతే దేశ సమగ్రతకే భంగం వాటిల్లుతుంది. రాష్త్ర యంత్రాంగం విఫలమయిందని భావిస్తే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అంశంపై పరిశీలించాలి.
- కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్
సెలవు రోజుల్లో ఏటీఎంలు ఖాళీ
ఒక్కరోజు ఏదైనా సెలవు వస్తే చాలా బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండటం లేదు. చాలామంది ఫోన్‌పే, గూగుల్‌పేలు వాడితే లేనిపోని ఇబ్బందులు వస్తాయేమో అన్న భయంతో వాటి జోలికి వెళ్లడం లేదు. అలాంటి వారు నగదు లావాదేవీల వైపే ఇంకా మొగ్గు చూపుతున్నారు. కనుక, సెలవులకు ముందు రోజే అన్ని ఏటీఎంలలో నగదు వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. తద్వార సామాన్య ప్రజల అవస్థలు తీరుతాయి.
-షేక్ అస్లాం షరీఫ్, శాంతనగర్