calender_icon.png 18 July, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాకు నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్, ఓపెన్ సోర్స్ జీఐఎస్ కోహార్ట్ అవార్డులు

18-07-2025 09:20:16 AM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) యంత్రాంగానికి ప్రతినిధిగా, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్,  గురువారం ఐఐటి బాంబేలో నిర్వహించిన ‘ఓపెన్ సోర్స్ GIS డే’లో ‘నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ ఓపెన్ సోర్స్ GIS కోహార్ట్ అవార్డు’ లను అందుకున్నారు. ఈ అవార్డులను ISRO ఐ ఎస్ ఆర్ ఓ మాజీ చైర్మన్ శ్రీ ఏ.ఎస్. కిరణ్ కుమార్  ప్రదానం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుని, జియోస్పేషియల్ టెక్నాలజీ నిపుణులతో కలిసి భారతదేశంలో నిర్వహించిన మొట్టమొదటి ‘ఓపెన్ సోర్స్  జి ఐ ఎస్ సదస్సు’ నిర్వహణకు గాను, అలాగే జిల్లాలోని వివిధ సమస్యలకు సంబంధించి ఓపెన్ సోర్స్ జియోస్పేషియల్ టెక్నాలజీ ద్వారా జిల్లా విద్యార్థులు, అధికారులు భాగస్వాములుగా పాల్గొని, మన జిల్లా సమస్యలను లోకల్ స్థాయిలో పరిష్కరించే విధంగా కృషి చేసినందుకు ఈ రెండు అవార్డులు లభించాయి. జిల్లా స్థాయిలో జి ఐ ఎస్ ఆధారిత వ్యవస్థలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి, గ్రామీణ సమస్యల పరిష్కారంలో జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినందుకు ఈ గుర్తింపు లభించింది. గోదావరి వరదల సమయంలో ఫ్లడ్ ప్రిడిక్షన్, గ్రామీణ స్థాయిలో జిఐఎస్ స్కిల్లింగ్, విభిన్న శాఖల డేటాను భౌగోళిక సమాచారంతో అనుసంధానం చేసి నిర్ణయాలు తీసుకునే విధానాలను జిల్లా యంత్రాంగం ముందుండి అమలు చేసింది.

భారతదేశంలో మొట్టమొదటి "ఓపెన్ సోర్స్ జిఐఎస్ కోహార్ట్" ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసి, ఐఐటీ బాంబే పోసి జిఐఎస్(IIT Bombay FOSSEE GIS) సహకారంతో క్యూజిఐఎస్ వినియోగాన్ని గ్రామీణ సమస్యల పరిష్కారానికి ప్రాక్టికల్‌గా నేర్పడంలో జిల్లా నేతృత్వం వహించింది. గోదావరి వరదల ముందు ముంపు గ్రామాల గుర్తింపు, పి హెచ్ సి పరిధిలో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ, పత్తి రైతులను మునగసాగు వైపు మారుస్తూ రైతులను స్వయం సమృద్ధి వైపు నడిపించే ప్రయత్నాలు జిల్లాలో కొనసాగుతున్నాయి.

 అవార్డు అందుకున్న సందర్భంలో కలెక్టర్  మాట్లాడుతూ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భౌగోళికంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా, 37% గిరిజన జనాభాతో విస్తరించిన జిల్లా. గిరిజనుల విలువైన సంస్కృతి కలిసికట్టుగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లే మార్గాన్ని చూపిస్తోంది. జిఐఎస్ సాయంతో పత్తి, మొక్కజొన్న పొలాలను మ్యాప్ చేసి, రైతులను మునగసాగు వైపు మళ్లించే ప్రయత్నం మొదలు పెట్టాము. ఇది రైతులను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చడానికి దోహదపడుతోంది. అలాగే, మేకల పెంపకం, మేకపాల ఉత్పత్తి పెంపుదలపై జిఐఎస్ ఆధారంగా పరిశీలనలు జరుగుతున్నాయి. ఈ వేదిక ద్వారా  ఐఐటీ బాంబే సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లాకు తీసుకువచ్చి, రైతులు, విద్యార్థులు, అధికారులు అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నాము. విద్యార్థులు ఐఐటీ బాంబేసాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం, పట్టణాభివృద్ధి, కమ్యూనికేషన్ విస్తరణలో దృష్టి పెట్టి ఉత్పాదకతను పెంచి జిల్లాకు ఆర్థిక వృద్ధిని తీసుకురాగలరని నమ్మకం ఉంది. ఈ రెండు అవార్డులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులందరికీ గర్వకారణమని, GIS ఆధారిత కార్యక్రమంలో కృషి చేసిన HPHF బృందానికి, Aspirational Block Fellow ఆస్ప్రెషన్ సెల్ బ్లాక్ ఫెల్లో నవనీతకు జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, అభినందనలు తెలిపారు.