17-10-2025 12:37:02 AM
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న తాజాచిత్రం ‘కే ర్యాంప్’. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ దీపా వళి సందర్భంగా ఈ నెల 18న థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అనూహ్యంగా సుమారు 3 వేల మంది రావడంతో టీమ్ షాక్‌కు గురైంది.
ఈ ఊపును కొనసాగిస్తూ ‘కే ర్యాంప్’ను యువతకు మరింత దగ్గర చేసే బాధ్యతను హీరో కిరణ్ తన భుజస్కంధాలపై వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తన కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా సరికొత్తగా ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నారు. గతంలో తన సినిమా ‘ఎస్‌ఆర్ కళ్యాణ మండపం’కు డీజే మిక్స్ చేసి ఆ కంటెంట్‌ను వైరల్ చేశారు. ఇప్పుడు ‘కే ర్యాంప్’ టీజర్, ట్రైలర్‌తో డీజే మిక్స్ చేసి యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తద్వారా ఈ డీజే మిక్స్ ప్రయోగం ‘కే -ర్యాంప్’పై ఒక వైబ్ క్రియేట్ చేస్తోంది. టీజర్, ట్రైలర్‌లో పేలిన డైలాగ్స్ అన్నీ ఈ డీజే మిక్స్‌లో యాడ్ చేయడం కొత్త ఫీల్ కలిగిస్తోంది. ఈ డీజే మిక్స్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో దూసుకుపోతోంది.