26 August, 2026 | 3:39 AM

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

26-08-2026 12:07 AM

స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే వన మహోత్సవ లక్ష్యం

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి, ఆగస్టు 25: వన మహోత్సవంలో భాగంగా జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు.

మంగళవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. మొక్కలను నాటడం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా, వాటిని నిరంతరం సంరక్షించి పెద్దవిగా పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్లు పెరిగితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని పేర్కొన్నారు.

జిల్లాలో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేపడుతున్నామని, తద్వారా మొక్కల వివరాలను నమోదు చేసి వాటి సంరక్షణపై పర్యవేక్షణ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి, డీఆర్డీఓ జ్యోతి, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి, పీసీబీ అధికారి విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ చలపతిరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, తహసీల్దార్ జయరాం నాయక్, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.