యాసంగి ధాన్యం ప్రతిగింజ కొనుగోలు చేయాలి: కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం , మార్చి 31, (విజయక్రాంతి): యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తో కలసి కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు, వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, తూనికలు -కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖ అధికారులు, సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,87,309 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉన్నదని, అందులో సన్న రకం 1,35,365 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 51,944 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 168 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యాన్ని ఏ, బి గ్రేడ్లుగా విభజించి మద్దతు ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,389, బి గ్రేడ్కు రూ. 2,369 ధరలు నిర్ణయించగా, సన్న రకం వడ్లకు అదనంగా రూ. 500 బోనస్ ఇవ్వబడుతుందని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ నియంత్రణ కోసం క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు టోకెన్లు జారీ చేయాలని సూచించారు.
సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యం రాకుండా జిల్లాలో చెక్పోస్టుల ద్వారా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు ఆన్లైన్ నమోదు చేసి రైస్ మిల్లులకు తరలించాలని, రవాణాలో జాప్యం జరగకుండా మిల్లర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులు ధాన్యం విక్రయానికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాలు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ వెంట తీసుకురావాలని సూచించారు. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిపారు.
గన్నీ సంచులు సరిపడా నిల్వలో ఉంచి, ఆన్లైన్ నమోదు చేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలని, వాటి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సమయంలో ఐరిస్ స్కానర్ ద్వారా మాత్రమే ప్రక్రియ పూర్తి అవుతుందని, డేటా ఎంట్రీ సమయంలో రైతు తప్పనిసరిగా హాజరుగా ఉండాలని తెలిపారు. తూకపు పరికరాలను తనిఖీ చేసి సీల్స్ వేయాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్ డి ఓ మధు,పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్ బాబు , పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ , వ్యవసాయ అధికారి బాబురావు, తూనికలు-కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్ పాల్గొన్నారు.




