ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి
ఎల్లారెడ్డి, జూన్4 (విజయక్రాంతి): ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ రెండో వార్డులో గురువారం వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పాల్గొన్నారు. వార్డు సభలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన వెంటనే బీసీ కాలనీ ప్రాంతం వర్షపు నీటితో మునిగిపోతుందని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో మురుగు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. నూతన మురుగు కాలువల నిర్మాణంతో పాటు వీధి దీపాల ఏర్పాటు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేపట్టాలని కోరారు.
అలాగే దోమల బెడద అధికంగా ఉందని, దోమల నివారణకు ప్రత్యేక స్ప్రేయింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, కోతులు మరియు వీధి కుక్కల సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను మురుగు కాలువల్లో వేయడం వల్ల డ్రైనేజీలు మూసుకుపోతున్నాయని తెలిపారు.
ప్రతి ఇంటిలో సెప్టిక్ ట్యాంకులు నిర్మించుకోవాలని, తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలకు అందజేయాలని కోరారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురుగు నీటి నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో నూతన డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని,
ఎల్లారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఎల్లారెడ్డిని రాష్ట్రంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. స్థానిక కౌన్సిలర్ మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్, డీసీసీ ఉపాధ్యక్షులు విద్యాసాగర్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు పప్పు వెంకటేశం, మహమ్మద్ వసీం, మున్సిపల్ ఏఈ వినోద్, ఎలక్ట్రికల్ ఏఈ, కాంగ్రెస్ నాయకులు రామగల్ల శివానందం, వార్డు అధికారి అవినాష్, ఆర్పీ రేఖతో పాటు మున్సిపల్ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






