పసుపు ఆ‘ధర’హో..!
కేసముద్రం, జూన్ 4 (విజయక్రాంతి): పసుపు ధర క్వింటాలుకు ఒక్కసారిగా వెయ్యికి పైగా పెరగడంతో పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురువారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు 1,246 క్వింటాళ్ల పసుపు విక్రయానికి రైతులు తెచ్చారు. అయితే పసుపు ధర మొన్నటి వరకు క్వింటాలుకు 12 వేల లోపు ఉండగా గురువారం 13 దాటింది. పసుపు కాడి రకానికి క్వింటాలుకు గరిష్టంగా 13,009 రూపాయలు లభించగా, కనిష్టంగా 5,019, గోల రకానికి 11,650, కనిష్టంగా 6,300 రూపాయల ధర లభించింది.
మార్కెట్కు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున పసుపు విక్రయానికి రావడం ఇదే మొదటిసారిగా వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. షెడ్లలో మక్కలు నిల్వ చేయడంతో పసుపు విక్రయానికి తెచ్చిన రైతులు వ్యాపార సముదాయం వరండాలో, చిన్న షెడ్లలో పోయాగా, మరి కొన్ని రాశులు మిగిలిపోవడంతో ఓపెన్ యార్డులో పోశారు. వర్షం రావడంతో పసుపు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు కొంత ఇబ్బంది పడ్డారు.






