12 August, 2026 | 2:41 AM

పతి ఒక్కరూ రాజ్యాంగ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలి

12-08-2026 12:37 AM

హనుమకొండ, ఆగస్టు 11 (విజయ క్రాంతి): రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత  అన్నారు. మంగళవారం హనుమకొండ లోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వరంగల్ ఫీల్ కార్యాలయం ఆధ్వర్యంలో  ’హర్ ఘర్ తిరంగా’ పై రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రాం, ఫోటో ఎగ్జిబిషన్ ను వారు ప్రారంభించారు. ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అనంతరం వరంగల్ ఫీల్ పబ్లిసిటీ ఆఫీసర్ తరుణ్ కుమార్ బోడా సీబీసీ రూపొందించిన జాతీయ పతాకం యొక్క ప్రస్థానం, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల పై ఫోటో ఎగ్జిబిషన్లోని అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్రం కోసం జరిగిన త్యాగాలు, పోరాటాల జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని, జనవరి 26వ తేదీని ఎంతో ఘనంగా జరుపుకుంటామని, ఇలాంటి కార్యక్రమాలను కూడా ప్రతి సంవత్సరం స్వాతంత్య్రం వెనుక ఎంతటి కృషి, త్యాగం, పోరాటం దాగి ఉందో మనం ఎప్పటికీ మరచిపోకూడదనే ఉద్దేశంతో నిర్వహిస్తుంటామన్నారు. అనంతరం క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి. శ్రీనివాస్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రజనీ లత, సమత, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.