డిల్లీ విద్యార్థుల పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి
- సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి
- హనుమకొండలో సిపిఐ ప్రదర్శన, పాదయాత్ర ముగింపు
హనుమకొండ (మహబూబాబాద్) ఆగస్టు 11 (విజయక్రాంతి): దేశంలోని ప్రజా వ్యతిరేక బీజేపీ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకే సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వెయ్యి స్థంబాల దేవాలయం నుండి ఈ ప్రదర్శన హనుమకొండ చౌరస్తా మీదుగా పబ్లిక్ గార్డెన్ వరకు కొనసాగింది.
సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశంలో మార్పు కోసం ఆగష్టు 6న జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర వారం రోజులుగా జిల్లాలో కొనసాగి మంగళవారం ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ప్రచార జాత పాదయాత్ర నిర్వహిస్తుందని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలే దాని పతనానికి దారి తీస్తాయని అన్నారు.
దేశంలో మార్పు కోసం సిపిఐ పోరాటం సాగిస్తోందన్నారు. బీజేపీ 12 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగకరమైన ఒక మంచి పని చేయలేక పోయిందని, ధరలను అరికట్టడంలో, ఉద్యోగాల కల్పనలో విఫలమైందన్నారు. మహిళా రిజర్వేషన్ విషయంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా దానికి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును జోడించి ఆమోదింపజేసుకోవడానికి కుట్ర పన్నారన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలు అనేక మార్లు లీక్ అయి లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. డిల్లీ విద్యార్థుల పోరాట స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సీనియర్ రాష్ట్ర నాయకులు టి. వెంకట్రాములు, రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, జిల్లా నాయకులు ఎన్.ఎ స్టాలిన్, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, బత్తిని సదానందం, జక్కు రాజు గౌడ్, బాషబోయిన సంతోష్, కొట్టెపాక రవి, ఏదునూరి వెంకట్రాజం, వేల్పుల సారంగపాణి, నేదునూరి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.






