16-08-2024 01:49:25 AM
రంగారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): రంగారెడ్డి కలెక్టరేట్ అవినీతికి అడ్డాగా మారింది. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల కార్యాలయాలను గత కొంతకాలంగా పైరవీకారులు, దళారులు అడ్డాగా మార్చుకొని దందాను సాగిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల తీరు విస్తుగొలుపుతోం ది. జిల్లాలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, చెరువు శిఖం, భూదాన్ భూములను ధరణిలో లొసుగులను అడ్డం పెట్టుకొని బడా బాబులు, రాజకీయ పలుకుబడి కలిగిన నేతలు, కార్పొరేట్ శక్తులు చెరబడుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవె న్యూ అధికారులే వారికి హారతులు పట్టి మరీ తమ కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నారు.
నిబంధనలు గాలికి వదిలేసి అక్రమార్కుల నుంచి లంచాలు పుచ్చుకొని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్, నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయిలో రెవెన్యూ కార్యాలయాల్లో చేయి తడిపితే చాలు సంబంధిత సెక్షన్ల నుంచి ఫైల్స్ చకచకా కదులుతుంటాయి. ఇటీవల మహేశ్వరం నియో జకవర్గం బాలాపూర్ మండలంలోని గూర్రంగూడకు చెందిన ముత్యంరెడ్డి అనే వ్యక్తి తనకున్న 14 గుంటల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి (రెవెన్యూ)కు లంచంగా రూ.8 లక్షలు ఇస్తుండగా ఏసీబీకి పట్టుబడడంతో రెవెన్యూలో జరుగుతున్న అవినీతి తతంగం మరోసారి చర్చకు తెరలేపినట్లయింది. జిల్లా రెవెన్యూ శాఖ అధికారులే కాకుండా వివిధ శాఖల అధికారులు సైతం ఏసీబీకి పట్టుబడుతున్నారు.
కాసులు కురిపిస్తున్న ధరణి..
గత ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరిట తీసుకొచ్చిన ధరణి.. అక్రమార్కులకు, అవినీతి అధికారులకు కాసులు కురిపిస్తోంది. మండల రెవెన్యూ కార్యాలయాలు మొదలుకొని కలెక్టర్ కార్యాలయాల వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధరణి ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పలు రికార్డుల్లో మార్పులు, చేర్పులు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇటీవల నార్సింగి, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని కోట్ల విలువ చేసే నిషేధిత భూములను ధరణి ఆపరేటర్లు రికార్డులను మార్చి అక్రమార్కుల పేరిట పాసుపుస్తకాలు సైతం జారీ చేసేలా చేశారు. దీంతో వారిపై కేసులు సైతం నమోదయ్యాయి. నిత్యం అక్రమార్కులు ఆయా కార్యాలయాల వద్ద తిష్ట వేస్తూ తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు.
ఏరియాను బట్టి ధర ఫిక్స్..
పలువురు రెవెన్యూ అధికారులు జిల్లాలో భూమి డిమాండ్ ఉన్న ఏరియాను బట్టి ముందే తమ రేటును ఫిక్స్ చేసుకుంటున్నారు. నిషేధిత జాబితా, పట్టదారు పాసుపుస్తకాల తప్పొప్పుల సవరణలు, అసైన్డ్, ప్రభుత్వ, దేవదాయ, వక్ఫ్ ఇలా వివాదాస్పద భూములను బట్టి అధికారుల రేట్లు తరచుగా మారుతుంటాయి. రెవెన్యూలో కీలక శాఖలో పనిచేస్తున్న అధికారులు తమ అనుచరులను కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసుకుంటున్నారు. పనుల నిమిత్తం వచ్చేవారిని ముందే తమ అనుచరులను కలిసేలా అధికారులు పురమాయిస్తున్నారు.
భూ సమస్యలను బట్టి రేట్లను ఫిక్స్ చేసుకొని సమస్యలను క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలు నిత్యం వినిపిస్తున్నా యి. జిల్లాలోని పలు మండలాల పరిధిలో ధరణిలో భూ సమస్యలు ఫైల్స్ గుట్టలుగా పేరుకుపోయాయి. ఈ భూ సమస్యలను అడ్డం పెట్టుకొని దళారులు యథేచ్ఛగా కలెక్టరేట్‌లోని రెవెన్యూ కార్యాలయాల వద్ద తచ్చాడుతూ కనపడుతుండడం విశేషం. ఇక కోర్టు లిటిగే షన్ భూ సమస్యలు తమ దగ్గరికి వస్తే అధికారులకు పంట పండినట్లే. కోర్టు కేసులను సాకుగా చూపించి రూ.లక్షలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.