60 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కరీంనగర్, జూన్ 6 (విజయక్రాంతి): కరీంనగర్ టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచి, కరీంనగర్ రూరల్ పోలీసులు సంయుక్తంగా 60 కిలోల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్ క్రాస్ రోడ్ దుర్శేడ్ గ్రామం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన చందు నాగేశ్వర్‌రావు వద్ద రూ.1.20 లక్షల విలువ చేసే 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి కేసు నమోదు చేసినట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ తెలిపారు. నిందితుడు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా వారం గ్రామంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, కరీంనగర్ రూరల్ ఎస్సై శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 6 (విజయక్రాంతి) : కాలం చెల్లిన, నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగుల మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే హెచ్చరించారు. పట్టణంలోని రాయల్ ఆగ్రోస్ దుకాణాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి గురువారం కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. విత్తనాలు, ఎరువుల వివరాలను పరిశీలించారు. దుకాణం వివరాలు నోటీస్ బోర్డుపై పొందుపర్చాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎప్పీ ప్రభాకర్‌రావు, వ్యవసాయాధికారి ఖాదర్‌హుస్సేన్, సీఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.






