21 March, 2026 | 5:20 AM

జాతీయ ఇన్‌స్పైర్ అవార్డు మనక్, 2026కు ఎక్స్‌లెంట్ భాషా హైస్కూల్ విద్యార్థిని ఎంపిక

21-03-2026 12:41 AM

పినపాక, మార్చి 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఇ. బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాష హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న జి. గీతిక రూపొందించిన ‘కొండ ప్రాంతాలలో సురక్షిత ప్రయాణం‘(సేఫ్ జర్నీ ఎట్ ఘాట్ రోడ్డు) అను వినూత్న ఆలోచనకు గాను జాతీయ స్థాయిలో ఇన్స్ పైర్ అవార్డు _ మనక్,2026 కు ఎంపికైనట్లు ఎక్స్ లెంట్ విద్యాసంస్థల (ఎక్స్ లెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్) చైర్మన్ యూసఫ్ షరీఫ్ తెలిపారు.

జాతీయ స్థాయిలో ఎంపికైనందుకు విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఎక్స్ లెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ.... పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో సైన్స్, పరిశోధన మరియు ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి భారత ప్రభుత్వం ఇన్స్ పైర్ అవార్డు_మనక్ అనే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని అన్నారు.

ఈ కార్యక్రమం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులలోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ ఆలోచనల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.10,000 ల నగదు పురస్కారం ఇవ్వడంతో పాటు జిల్లా, రాష్ట్ర మరియు జాతీయస్థాయి సైన్స్ ప్రదర్శనలలో పాల్గొనే అవకాశం కల్పిస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇన్స్ పైర్ అవార్డు _ మనక్ కు ఎక్స్ లెంట్ విద్యా సంస్థల , విద్యార్థిని_ విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ లెంట్ విద్యాసంస్థల డైరెక్టర్లు ఖాదర్ షరీఫ్, యాకూబ్ షరీఫ్,ముక్కు నరసారెడ్డి బండారు నరేంద్ర, ప్రిన్సిపల్ అంకం సురేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.