03-05-2025 12:28:40 AM
* తోటి ఉద్యోగి పెండింగ్ బిల్లులు చేసేందుకు లంచం డిమాండ్
వికారాబాద్, మే 2 వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రూ. 8000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
ఏసిబి డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ లోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో శ్రీధర్ సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఉద్యోగుల జీతాలు ఇతర బిల్స్ చేస్తాడు. కాగా అదే శాఖలో పనిచేస్తున్న తోటి ఉద్యోగికి సంబంధించిన 2022- 23 సంవత్సరానికి సంబంధించిన రూ. 76 వేల పైచిలుకు బిల్లు రావాల్సి ఉంది.
దీంతో అతడు సీనియర్ అసిస్టెంట్ ను బిల్లు చేయాలని కోరగా అతడు లంచం డిమాండ్ చేశాడు. మొత్తం బిల్లులో 11% తనకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకపోతే బిల్ పాస్ చేయనని చెప్పాడు. కాగా అతని వద్ద డబ్బులు లేకపోవడంతో బిల్ చేయండి బిల్లు వచ్చాక ఇస్తానని సదరు ఉద్యోగి తెలిపాడు.
దీంతో బిల్ చేయడంతో ఈ మధ్యనే బిల్లు డబ్బులు అకౌంట్లో వచ్చాయి. కాగా చెప్పిన విధంగా రూ. 11% డబ్బులను రూ. 8000 తీసుకురావాలని పలుమార్లు ఫోన్ చేసి అడగడం జరిగింది. దీంతో ఆ ఉద్యోగి ఏసీబీ ని ఆశ్రయించగా శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో 4: 20 గంటల సమయంలో రూ. 8వేల నగదు శ్రీధర్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని నుంచి నగదు స్వాధీనం చేసుకొని అన్ని వివరాలు సేకరించారు.
నాంపల్లిలోని కోర్టులో హాజరు పరుస్తామని డిఎస్పి తెలిపారు డబ్బులు తీసుకోవడంలో ఇంకా ఎవరైనా పాత్ర ఉందని కోణంలో విచారిస్తున్నట్లు డిఎస్పి తెలిపారు.