14-02-2026 12:00:00 AM
స్వతంత్రులే కింగ్‌మేకర్స్
బీఆర్‌ఎస్ కాంగ్రెస్ కసరత్తు
మున్సిపాలిటీల్లో హంగ్ రాజకీయాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, అసిఫాబాద్ మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు హంగ్కు దారితీశాయి. స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి దక్కకపోవడంతో చైర్మన్ పీఠం కోసం ప్రధాన పార్టీల మధ్య తీవ్ర రాజకీయ కసరత్తు ప్రారంభమైంది.
కాగజ్‌నగర్‌లో మిశ్రమ ఫలితాలు
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్): 11, భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్): 9, భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 5, ఆల్ ఇండియా మజ్లిస్- ఇ-ఇత్తెహాద్- ఉల్-ముస్లిమీన్ (ఎంఐఎం): 1, స్వతంత్రులు: 4, స్వతంత్ర సభ్యుల మద్దతు లేకుండా చైర్మన్ పీఠం దక్కే పరిస్థితి లేకపోవడంతో అన్ని పార్టీల చూపు వారి వైపే కేంద్రీకృతమైంది.
స్వతంత్రులే కీలకం
రెండు మున్సిపాలిటీల్లోనూ స్వతంత్ర అభ్యర్థులే కీలక పాత్ర పోషిస్తున్నారు. చైర్మన్ పీఠం ఇస్తేనే మద్దతు అంటూ స్వతంత్రులు అల్టిమేటం ఇవ్వడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు స్వతంత్ర సభ్యులతో చర్చలను ముమ్మరం చేస్తున్నారు. అయితే చివరకు ఎవరి వైపు స్వతంత్రులు మొగ్గు చూపుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
కిడ్నాప్ ప్రచారంతో కలకలం
ఆసిఫాబాద్లో స్వతంత్ర అభ్యర్థి జాడి వినో ద్ కిడ్నాప్ అయ్యాడని, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ వినోద్‌ను తీసుకెళ్లినట్టు ప్రచారం జరగడం రాజకీయంగా కలకలం రేపింది. రిజర్వేషన్లు అనుకూలించక తమ స్వంత వార్డుల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కొంతమంది నాయకులు పక్కవార్డు ల్లో పోటీ చేశారు.
అయితే ఆ ప్రాంత ప్రజ లు వారిని స్థానిక నేతలుగా విశ్వసించకపోవడంతో వారు పరాజయం పాలయ్యారు. పార్టీ బలం, స్థానిక నాయకుల మద్దతుతో గెలుపొందవచ్చని భావించిన వారికి ఈ ఫలితాలు చుక్కెదురయ్యాయి. మొత్తానికి, ఆసిఫాబాద్, కాగజ్నగర్ రెండు మున్సిపాలిటీల్లోనూ హంగ్ పరిస్థితులు కొనసాగుతుం డటంతో, చైర్మన్ పీఠం ఎవరి వశమవు తుందన్న దానిపై రాజకీయ వర్గా ల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆసిఫాబాద్‌లో బీజేపీకి షాక్
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా బీఆర్‌ఎస్: 9, కాంగ్రెస్: 7, స్వతంత్రులు: 4, ఈ ఎన్నికల్లో బీజేపీ ఖాతా కూడా తెరవకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.