27 June, 2026 | 5:52 AM

భారత్ వృద్ధి బాటకు ఢోకా లేదు

06-06-2024 01:24 AM

అవుట్‌లుక్ ‘పాజిటివ్’

పునరుద్ఘాటించిన ఫిచ్ రేటింగ్స్

ముంబై, జూన్ 5: విశ్లేషకుల అంచనాలకు భిన్నమైన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘పాజిటివ్’గా పునరుద్ఘాటించింది. బీజేపీ నేతృత్వంలోనే ఎన్‌డీఏ కూటమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఈ నేపథ్యంలో భారత్ ఆర్థికాభివృద్ధి బాటకు మధ్యకాలికంగా ఢోకా లేదని బుధవారం ఫిచ్ విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మూలధన వ్యయం, పటిష్ఠవంతమైన కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ దన్నుగా నిలుస్తాయని తాము అంచనా వేస్తున్నట్టు ఫిచ్ డైరెక్టర్, ప్రైమరీ సావరిన్ అనలిస్ట్ జెరెమీ జూక్ తెలిపారు. 

క్యాపెక్స్‌కు రూ.9.48 లక్షల కోట్లు

మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ 2023 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపు వ్యయంలో  రూ.9,48,506 కోట్ల క్యాపెక్స్ (మూలధన వ్యయం) ఉపయోగించుకున్నట్టు గతవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయని జూక్ గుర్తు చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో (సవరించిన అంచనా) రూ.9,49,555 లక్షల కోట్లలో 99.9 శాతం మూలధన వ్యయాల్ని ప్రభుత్వం చేసిందన్నారు. అయితే తదుపరి వృద్ధి కొత్త ప్రభుత్వం అమలు చేసే సంస్కరణలపై ఆధారపడి ఉంటుందని ఫిచ్ డైరెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వం సంస్కరణల అమలు వేగం, సమర్థతలనుబట్టి వృద్ధి ఉంటుందన్నారు.

కీలక సంస్కరణల అమలు సవాలే

ఎన్నికల తర్వాత ఏర్పడిన అసందిగ్దతను భారత్ అధిగమించి, తిరిగి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారని వెల్లడైనప్పటికీ, ‘మారిన పరిణామాల’ నేపథ్యంలో కీలక సంస్కరణల అమలు సవాలేనని బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ తాజా రిపోర్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణలో ఉన్న మౌలిక రంగ ప్రాజెక్టు రుణా లపై ప్రొవిజనింగ్ పెంచాలంటూ బ్యాంక్‌లను రిజర్వ్‌బ్యాంక్ ఆదేశిస్తూ ఇటీవల ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసిందని, ఇది భారత్ క్యాపెక్స్ మూమెంటంను దెబ్బతీస్తుందని ఎమ్కే గ్లోబల్ హెచ్చరించింది.