03-12-2025 02:19:54 PM
రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం.
తెలంగాణ మోడల్ సృష్టిస్తా.
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ మతంపై( Hindu gods) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు(Bharatiya Janata Party) ఆందోళన చేపట్టారు. దీంతో నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ శ్రేణులు సీఎం దిష్టి బొమ్మ దగ్దం చేశారు. బీజేపీ నేతల ఆందోళనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోవడంతో దీన్ని వివాదం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు తన నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడినవి ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఉత్తర భారతాన కూడా నన్ను పాపులర్ చేస్తున్నారు.. సంతోషం' అన్నారు. హిందూ సమాజంలాంటిదే కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షులకు చెప్పానని వివరించారు. పార్టీ నేతగా ఎలా పని చేయాలనేది వివరించే క్రమంలో చెప్పానని వెల్లడించారు.
ఢిల్లీలో బుధవారం ఉదయం ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ఈ భేటీ సందర్భంగా మోదీతో తాను మాట్లాడిన విషయాలను రేవంత్ రెడ్డి వెల్లడిస్తూ... మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ కు మద్దతిచ్చారని ప్రధాని మోదీతో అన్నాను.. మన్మోహన్ మద్దతుతో గుజరాత్ మోడల్ రూపొందించారని సూచించారు. ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సహకరించారని రేవంత్ రెడ్డితో ప్రధాని తెలిపారు. గుజరాత్ మోడల్ కు మన్మోహన్ సహకరించినట్లు తెలంగాణకు సహకరించాలని ఆయనను సీఎం కోరారు. మీ సహకారంతో తెలంగాణ మోడల్ సృష్టిస్తా అని రేవంత్ మోదీకి చెప్పారు. తెలంగాణకు తప్పనిసరిగా అవసరమైన సహకారాన్ని అందిస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఓఆర్ఆర్ఆర్ ను ఆర్ఆర్ఆర్ కు అనుసంధానించే రేడియల్ రోడ్డు అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. న్యూఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడిన ప్రతినిధి బృందం పార్లమెంట్ హౌస్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిసింది.