8 August, 2026 | 1:17 AM

నవోదయ ప్రవేశ దరఖాస్తు గడువు పొడగింపు

08-08-2026 12:02 AM

ఆగస్టు 10 వరకు అవకాశం ప్రిన్సిపాల్ దాసి రాజేందర్

గజ్వేల్ ఆగస్టు 7 (విజయక్రాంతి) : జవహర్ నవోదయ విద్యాలయం, వర్గల్లో 202728 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌలభ్యం కోసం పరిపాలనా కారణాలతో గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి (202627) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 5వ తరగతి చదువుతూ ఉండటంతో పాటు వారి తల్లిదండ్రుల నివాసం కూడా ఉమ్మడి జిల్లాలో ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్నెట్ సెంటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ధ్రువపత్రం, ఫొటోతో దరఖాస్తు సమర్పించవచ్చన్నారు. ఆగస్టు 10 చివరి తేదీ కాగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా చూడాలని కోరారు. ప్రవేశ ఎంపిక పరీక్ష నవంబర్ 28న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.